మెరుగైన సినిమాలే లక్ష్యంగా ‘సినిమాటిక్‌ ఎక్స్‌’ : పి.జి. విందా | PG Vinda Talk About Cinematica Expo | Sakshi
Sakshi News home page

అలా 'సినిమాటిక్‌ ఎక్స్‌పో'కి బీజం పడింది: పి.జి. విందా

Published Sat, Nov 23 2024 4:16 PM | Last Updated on Sat, Nov 23 2024 4:51 PM

PG Vinda Talk About Cinematica Expo

తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎందరో గొప్ప దర్శకులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ సినీ రంగానికి అనువైన చోటు. షూటింగ్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, షూటింగ్ కోసం రావాలంటే అందరికీ అనువుగా ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. అందుకే హైదరాబాద్‌లో సినిమాటిక్‌ ఎక్స్‌పో నిర్వహించాం. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎక్విప్ మెంట్ గురించి ముందే తెలుస్తుంది. దాంతో సాంకేతికంగా ఇంకా మెరుగైన సినిమాలను అందించగలం’ అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు పి.జి విందా. సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడంతో పాటు, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమాటిక్‌ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌కు మంచి స్పందన లభిచింది. ఈ నేపథ్యంలో తాజాగా పి.జి విందా మీడియాతో ముచ్చటిస్తూ ‘సినిమాటిక్‌ ఎక్స్‌పో’గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..

2004 వచ్చిన గ్రహణం చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి మీడియా నాకు ఇస్తున్న సపోర్ట్ ను మరువలేను. గ్రహణం సినిమాటోగ్రఫీకి నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. నిజానికి ఆ సమయంలో డిజిటల్ అంతగా లేదు. ఇండియాలో తొలుత డిజిటల్ చిత్రీకరణ జరుపుకున్న సినిమాల్లో గ్రహణం ఒకటి. రాబోయే ఐదు, పదేళ్లలో డిజిటల్ దే హవా ఉంటుందని అప్పుడే చెప్పాను. నా అంచనానే నిజమైంది.

నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయం నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి దేశ విదేశాలు వెళ్తుంటాను. ముఖ్యంగా విదేశాల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఎక్స్‌పో లు, ఎగ్జిబిషన్ లు నిర్వహిస్తుంటారు. మన దేశంలో ప్రత్యేకంగా సినీ పరిశ్రమ కోసం ఆ స్థాయి ఎక్స్‌పో లు లేవు. అదే ఈ సినిమాటిక్‌ ఎక్స్‌పో కు బీజం పడేలా చేసింది.

తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మేము నిర్వహించిన సినిమాటికా ఎక్స్‌పో మొదటి ఎడిషన్ కి గొప్ప స్పందన లభించింది. ఆ ఉత్సాహంతోనే రెండో ఎడిషన్ ని మరింత అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయించాము. దీనికి ఏకంగా విశేష స్పందన లభించి, ఏకంగా 38 వేల మంది హాజరు కావడం అనేది ఆసియాలోనే రికార్డు.

ఫిల్మ్ మేకింగ్ పై ఇప్పుడు ఎందరో ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అందుకే సినిమాటికా ఎక్స్‌పో ద్వారా సాంకేతికతను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి తగు సూచనలు చేస్తూ సెమినార్లు నిర్వహించాము. సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి సినీ ప్రముఖులు.. స్టోరీ రైటింగ్, సినిమాటోగ్రఫీ గురించి ఎంతో నాలెడ్జ్ ని పంచారు.

ఈ స్పందన చూసిన తర్వాత సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ ను మరింత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం రావడానికి అంగీకారం తెలిపాయి.

తెలుగు సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వంగా గారు సహా అందరి మద్దతు ఉంది. అలాగే ప్రభుత్వం మరియు భాష, సాంస్కృతిక శాఖ మద్దతుతో ఈ సినిమాటిక్‌ ఎక్స్‌పో ని మరో స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము.

తెలుగు సాహిత్యం కోసం మా వంతు సహకారం అందించడంతో పాటు, యువ ప్రతిభ కోసం భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement