
ఈ మధ్యకాలంలో ప్రభాస్ గురించి ఏ ప్రస్తావన వచ్చినా అందులో ‘ఆదిపురుష్’ సినిమా గురించి కచ్చితంగా ఏదో ఒక టాపిక్ ఉంటుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న త్రీడీ మూవీ కాబట్టి ఈ సినిమాకి ప్రభాస్ ఎన్ని రోజులు కేటాయించి ఉంటారు? షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుంది? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రభాస్ ఇచ్చిన డేట్స్ 90 రోజులు మాత్రమే అని తెలిసింది. ఇది భారీ సినిమా కదా.. మరి ప్రభాస్ 90 రోజులే డేట్స్ ఇవ్వడమేంటీ? అనుకోవచ్చు.
ఎక్కువ శాతం షూటింగ్ గ్రీన్ మ్యాట్ సెట్స్‌లో ప్లాన్ చేయడం వల్ల తక్కువ డేట్స్ సరిపోతుందని సమాచారం. అలాగే జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ ఆరంభమవుతుంది. టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
Comments
Please login to add a commentAdd a comment