సౌత్ ఇండియాలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తన కుటుంబంతో పాటు సినిమా ఛాన్స్‌ల విషయం గురించి కూడా మాట్లాడారు. తన జీవితంలో ఎక్కువగా బాధించిన ఘటనలు రెండు ఉన్నాయని ఆయన అన్నారు. తన కుమారుడి మరణమంతో పాటు స్నేహితురాలు గౌరీ (గౌరీ లంకేష్) మరణం అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.
ప్రకాశ్ రాజ్- లలిత పెద్ద కుమారుడు సిద్ధు (5) 2004లో మృతి చెందాడు. మేడపై గాలిపటాన్ని ఎగురవేస్తున్న సమయంలో ఒక స్టూల్ నుంచి జారిపడి కన్నుమూశాడు. ఆ సమయం నుంచి ప్రకాష్ రాజ్, లలిత మధ్య విభేదాలు పెరిగాయి. అలా చివరికి 2009లో లలితకు ప్రకాష్ రాజ్ విడాకులు ఇచ్చారు. అనంతరం 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే, కుమారుడి మరణం తీవ్రంగా బాధపెట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. కానీ, అలాగే బాధలో ఉండిపోతే ఎలా..? అని ముందుకు సాగానంటూ పంచుకున్నారు. 'ఆ సంఘటనతో నేను స్వార్థపరుడిగా మారలేను. నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నాకు వృత్తి ఉంది, నాకు మనుషులు ఉన్నారు. నేనూ ఒక మనిషి, నాకు జీవితం ఉంది, నాపై ఆధారపడి ఉన్న వాళ్లకు నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకే తిరిగి నిలబడ్డాను.' అని ఆయన అన్నారు.
ప్రశ్నించడం ఆపను
ఇండస్ట్రీలో బాలచందర్, కృష్ణవంశీ, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు ఇచ్చిన అవకాశాలే తనను ఇంతటి స్థాయికి చేర్చాయని ప్రకాష్‌రాజ్ గుర్తుచేసుకున్నారు. కథ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తానని ఆయన తెలిపారు. తనకు ఉన్న టాలెంట్‌కు ప్రజల నుంచి ఆదరణ, ప్రేమ వల్లే ఇక్కడ తాను నటుడిగా కొనసాగుతోన్నానని చెప్పారు. నేటి సమాజంలో గళం వినిపించలేని ప్రజలకు గొంతుకగా ఉంటానని ఆయన అన్నారు. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని బలంగా చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎన్ని కుట్రలు పన్నినా తట్టుకొని నిలబడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో కూడా అంతే స్థాయిలో నిలబడతానని ప్రకాష్ రాజ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment