హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతోంది. సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలను వెనక్కు నెడుతూ హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చూస్తుంటే ఈ మూవీ.. ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోనున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆఫీస్ బాయ్‌లా చూశాడు
ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే షార్ట్‌ఫిలింస్, డాక్యుమెంటరీలు చేశాను. నేను అందుకున్న సర్టిఫికెట్లను ఓ సూట్‌కేసులో పెట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్సులిస్తారేమోనని తిరిగేవాడిని. అది చూసిన చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని పంపించేశారు. కొన్నిరోజులకు పరిస్థితి అర్థమై అవేమీ లేకుండా తిరిగాను. ఓ సారి ఒకరి రికమండేషన్‌తో ఓ డైరెక్టర్‌ను కలిశాను. ఆయన ముందు కూర్చున్న రెండు నిమిషాలకే రేయ్, నీళ్లు తీసుకురారా అన్నాడు.
బూతులు తిట్టారు
ఆఫీస్ బాయ్‌ను పిలుస్తున్నాడేమోనని దిక్కులు చూస్తుంటే నిన్నేరా అన్నాడు. వెంటనే నేను కిచెన్‌లో నుంచి నెమ్మదిగా ఆఫీస్ బయటకు వచ్చేశాను. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇటీవల ఆ దర్శకుడు సాయం కోసం మా ఆఫీస్‌కు వచ్చాడు. ఆయనకు నేనెవరో గుర్తులేదు. నేను కూడా గతాన్ని తవ్వకుండా తనకు కావాల్సిన సాయం చేసి పంపించేశాను. ఒకసారైతే పెద్ద డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను వారికి కొంత దూరంలో నిలబడ్డాను. నన్ను చూసి.. నీకిక్కడ ఏం పనిరా.. వెళ్లిపో అని బూతులు తిట్టారు.
ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకున్నా
తర్వాత ఆ వ్యక్తే నా భుజంపై చేయి వేసి అందరికీ నన్ను మావాడే.. మా వాడే.. అని చెప్పుకుతిరిగాడు. ఇండస్ట్రీలో ఇవి సర్వసాధారణమే కావచ్చు. కానీ నేను తట్టుకోలేకపోయాను. చిన్నప్పటినుంచి ఇంట్లో నన్ను ఒక్కమాట అనేవారు కాదు. ఎవరి దగ్గరా ఒక మాట పడేవాడిని కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఈ ఇండస్ట్రీ నాకు కరెక్ట్ కాదు, వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ నిలదొక్కుకున్నాను అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.
Comments
Please login to add a commentAdd a comment