
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్"(ఆడు జీవితం). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాకు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఆడు జీవితం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. ఈ సినిమా గురించి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..' ఇటీవల వరదరాజ మన్నార్ పాత్రతో సలార్‌లో మీ ముందుకు వచ్చాను. మరోసారి ఆడు జీవితం సినిమాతో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ అనే పాత్రలో నటించా. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయింది. ఇప్పుడు సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 2008 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్‌లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం' అని తెలిపారు.
సినిమా షూటింగ్‌పై మాట్లాడుతూ..' నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గా. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే. మేము తిరిగి జోర్డాన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియాకు వచ్చాం. పాండమిక్ ఎప్పటికి ఆగిపోతుందో తెలియదు. ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహార ఎడారి మధ్యలో లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్‌కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం. 2008లో అనుకున్న సినిమా ఫైనల్‌గా 2024 మార్చి 28న మీ ముందుకు వస్తోంది. ఇంత కష్టపడిన ఈ సినిమాను ఫర్‌ఫెక్ట్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నామని' వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment