
Priyanka Chopra Get Angry For Calling Her Nick Jonas Wife: గ్లోబల్ స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం తన రాబోయే హాలీవుడ్ చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తాజాగా ప్రియాంక ఓ వార్తా కథనంపై విరుచుకుపడింది. ఇంకా అలా ఏన్నాళ్లు రాస్తారు అని మండిపడింది. మహిళలకు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందో అని అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల ఒక వెబ్‌సైట్ తన వార్తా కథనంలో ప్రియాంక చోప్రాను నిక్ జోనాస్ భార్యగా ప్రస్తావించడం (గుర్తింపు ఇవ్వడం) ప్రియాంక కోపానికి కారణమైంది. అలా రాసిన వార్తా కథనాన్ని తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
'మోస్ట్ ఐకానిక్ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రాన్ని నేను ప్రమోట్ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్ ఆఫ్..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్‌ని నా బయోకు జోడించాలా ?' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి ప్రియాంక భర్త నిక్ జోనాస్‌ను కూడా ట్యాగ్ చేసింది. ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్ సిటాడెల్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. తాను నటించిన 'ది మ‍్యాట్రిక్స్' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రియాంక అధికారికంగా ప్రారంభించింది.
'మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్' సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక 'సిటాడెల్' సినిమాతోపాటు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఒక బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్, అలియా భట్‌తో స్క‍్రీన్ షేర్ చేసుకోనుంది ప్రియాంక జోనాస్.
Comments
Please login to add a commentAdd a comment