గ్లామర్‌ పాత్రలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్‌ | Actress Priyanka Mohan Interested In Glamour Roles, Latest Photoshoot Pics Trending On Social Media - Sakshi
Sakshi News home page

గ్లామర్‌ పాత్రలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్‌

Published Tue, Mar 26 2024 6:50 AM | Last Updated on Tue, Mar 26 2024 9:55 AM

Priyanka Mohan Interested Glamour Roles - Sakshi

గ్లామర్‌ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు. ఇక చాలా మంది ఈతరం హీరోయిన్లు గ్లామర్‌ను నమ్ముకునే గడిపేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు. అయితే నటించేది మాత్రం గ్లామరస్‌ పాత్రల్లోనే. తాజాగా నటి ప్రియాంక మోహన్‌ కూడా ఇదే బాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కన్నడ భామ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నాని సరసన నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంలో నటించింది.

అందులోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మడిని అక్కడ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రియాంక మోహన్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం హిట్‌తో శివకార్తికేయన్‌తో మరోసారి డాన్‌ చిత్రంలో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. అలా పాపులరైన ప్రియాంక మోహన్‌కు స్టార్‌ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వచ్చింది.

ఆయనతో ఎదర్కుమ్‌ తుణిందవన్‌ (తెలుగులో ET) చిత్రంలో నటించింది.  ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నింటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. దీంతో అలాంటి ఇమేజ్‌కు పరిమితమైంది. అలాంటిది ఇటీవల ధనుష్‌ సరసన నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్‌ చిత్రం. మరొకటి డాన్స్‌ మాస్టర్‌ నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తోంది.

ఇకపోతే చాలా గ్యాప్‌ తరువాత తెలుగులో పవన్‌కల్యాణ్‌తో జత కట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్‌ గ్లామర్‌ గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్‌ చేసుకుని దిగిన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. అలా తాజాగా బెడ్‌ రూమ్‌లో ఫొటో షూట్‌ చేసుకున్న గ్లామరస్‌ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవి గ్లామర్‌ పాత్రలకు గ్నీన్‌ సిగ్నలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నటి ప్రియాంక మోహన్‌ గ్లామరస్‌ ఫొటోలకు ఇది కూడా ఒక కారణం అయ్యింటుందనేది ట్రోల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement