అందుకే ‘పెదకాపు’ అని టైటిల్‌ పెట్టాం: నిర్మాత | Producer Miryala Ravinder Reddy Talk About Peddha Kapu 1 Movie | Sakshi
Sakshi News home page

అందుకే ‘పెదకాపు’ అని టైటిల్‌ పెట్టాం: నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి

Published Tue, Sep 26 2023 4:51 PM | Last Updated on Tue, Sep 26 2023 4:51 PM

Producer Miryala Ravinder Reddy Talk About Peddha Kapu 1 Movie - Sakshi

‘అఖండ లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో కూడా వచ్చింది. పెద్ద స్టార్స్, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వాలని సన్నిహితుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఎవరితో చేసినా  మంచి కథ ఉంటే మంచి సినిమా అవుతుంది. దానికి స్టార్ యాడ్ ఐతే ఇంకా పెద్ద సినిమా అవుతుందని నా నమ్మకం. ఇలాంటి సమయంలో పెదకాపు కథ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది’ నిర్మాత రవీందర్‌ రెడ్డి అన్నారు.

అఖండ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై రవీందర్‌ రెడ్డి నిర్మించి చిత్రం ‘పెదకాపు-1’. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంతో విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... 

కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. అందుకే విరాట్‌ని హీరోగా ఎంచుకున్నాం. కొత్త హీరోతో ఇంతపెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం  ఏ దర్శకుడికైనా కొంచెంరిస్క్ అనిపిస్తుంది. ఐతే ఈ కథని బలంగా నమ్మాం. ఎలాంటి బౌండరీలు లేకుండా సినిమాని పెద్దగానే తీయాలని ముందుగానే చెప్పాను. మంచి జౌట్‌పుట్‌ వచ్చింది. 

ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంతపోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది. 

ఈ సినిమా అంత చాలా సహజత్వంతో ఉంటుంది. ఎక్కడ కృత్రిమంగా సెట్స్‌ వేయలేదు.  వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారు.  

ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు ఉంటాయి. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ.

మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా.. కర్ణ టైటిల్ ఐతే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కథ..పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని ఉండేవారికి ఆ పేరు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పేరుపెట్టాం.  

శ్రీకాంత్‌ అడ్డాల ఇందులో ఒక పాత్ర నటించాడు. కూర్చున్న చోటే అన్నీ చేసే పాత్ర అది. దీన్ని చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు. దీని కోసం ఓ ఇద్దరు నటులని అనుకున్నాం. కానీ వారికి వీలుపడలేదు. దీంతో శ్రీకాంత్ గారు కాల్ తీసుకున్నారు. ఒక దర్శకుడికి అన్ని పాత్రలు తెలుసు. ఆ పాత్రని దర్శకుడిగా శ్రీకాంత్ గారే అంత చక్కడా చేయగలరు. సినిమా చూసినప్పుడు మీరు చాలా సర్‌ప్రైజ్‌ అవుతారు. 

పెదకాపులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. 80నాటి పరిస్థితుల నేపధ్యంలో ఉండే కథ ఇది. ఒక కొత్త పార్టీ వస్తుందంటే యువతలో చైతన్యం ఉంటుంది. ఆ పార్టీతో తమ తలరాతలు మారుతాయనే ఆశ ఉంటుంది. రాష్ట్రంలోగాని, దేశంలో గాని ఒక కొత్తపార్టీ వస్తుందంటే ముందు ఎట్రాక్ట్ అయ్యేది యువతనే. అలా వచ్చిన పార్టీ వీరికి ఎలాంటి చేయూతనిచ్చిందనేది ఒక అంశంగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement