పుష్ప2 సినిమా అభిమానులకు శుభవార్త.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్‌తో జాతర మొదలైంది. అయితే, టికెట్ల ధరల విషయంలో ప్రేక్షకుల నుంచి కాస్త అసహనం వ్యక్తం కావడంతో పుష్ప సినిమా నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. దీంతో టికెట్ల ధరలను తగ్గించే పనిలో థియేటర్స్ ఉన్నాయి. మొదటిరోజు పుష్ప రికార్డ్ కలెక్షన్స్‌తో దుమ్మురేపాడు. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను పుష్ప2 సెట్ చేసింది. ఆదివారంతో వీకెండ్ ముగిసే సరికి ఈ మూవీ సుమారు రూ. 600 కోట్లకు చేరువలో ఉంటుందని తెలుస్తోంది.
పుష్ప2 సినిమా బాగున్నప్పటికీ మధ్యతరగతి ప్రేక్షకులకు అందేలా టికెట్ల ధరలు లేవని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో ఒక టికెట్ ధర రూ. 530 ఉంది. సింగిల్ స్క్రీన్ అయితే రూ. 350 ఉంది. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా వైపు వెళ్లడం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సినిమా బాగుంది.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ, టికెట్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో తర్వాతి రోజులకు సంబంధించి కొన్ని చోట్ల 50 శాతం కూడా బుకింగ్స్ జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీంతో సోమవారం నుంచి టికెట్ల ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 నుంచి 200 వరకు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఇలా
తెలంగాణలో సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్‌ఫిట్ షోలకు సింగిల్ స్క్రీన్లలో రూ.800, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 1000 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రీమియర్స్ షోల టికెట్ల ధరలు తెలంగాణలో మాదిరే ఉన్నాయి. డిసెంబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. అయితే, డిసెంబరు 17 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment