Pushpa 2: పుష్ప 2 కథేంటి? సుకుమార్‌ ఏం చెప్పబోతున్నాడు? | 'Pushpa 2: The Rule' - These Points Are Expecting From The Movie | Sakshi
Sakshi News home page

Pushpa 2: మరికొద్ది గంటల్లో ‘పుష్ప 2’.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేనా?

Published Wed, Dec 4 2024 4:48 PM | Last Updated on Wed, Dec 4 2024 5:07 PM

'Pushpa 2: The Rule' - These Points Are Expecting From The Movie

మరికొద్ది గంటల్లో పుష్ప 2 థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప : ది రైజ్‌’కు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది.  ఈ రోజు(డిసెంబర్‌ 4) రాత్రి 9.30 గంటల నుంచి తెలంగాణలో స్పెషల్‌ షోస్‌ పడబోతున్నాయి. అర్థరాత్రి తర్వాత పుష్ప 2 టాక్‌ ఏంటనేది బయటకు వచ్చేస్తుంది. పుష్ప 2 కథ పార్ట్‌ 1 కంటే గొప్పగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అసలు పార్ట్‌ 2లో సుకుమార్‌ ఏం చూపించబోతున్నాడనే ఆసక్తి బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులందరిలో మొదలైంది.  పార్ట్‌ 1లో వదిలేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది. అసలు పార్ట్‌ 1 వదిలేసిన ప్రశ్నలు ఏంటి? పార్ట్‌ 2లో ఏం చూపించబోతున్నారు? అనేది ఒక్కసారి చూద్దాం.

👉 ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టిన పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది ‘పుష్ప : ది రైజ్‌’లో చూపించారు. ఇక పుష్ప 2లో ఎర్ర చందనం సిండికేట్‌ను లీడ్‌ చేసే వ్యక్తిగా మారిన తర్వాత పుష్పరాజ్‌  తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడన్నది చూపించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ని దేశంలోనే కాకుండా.. విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ‘పుష్పా.. అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’ అనే డైలాగ్‌తో ఈ విషయం చెప్పకనే చెప్పేశారు.

👉 సాధారణంగా సీక్వెల్‌ కోసం ఓ బలమైన పాయింట్‌ని ముగింపులో చూపిస్తారు. బాహుబలి పార్ట్‌ 1లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది చెప్పకుండా పార్ట్‌ 2 కోసం ఎదురు చూసేలా చేశారు రాజమౌళి. కానీ పుష్పలో సుకుమార్‌ అలాంటి ఉత్కంఠత కలిగించే పాయింటేది దాచలేదు. ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు రావాలనే ఉద్దేశంతో అలా చేయ్యొచ్చు. సుకుమార్‌ సినిమాల్లో స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంటుంది. తనదైన ట్విస్టులతో అలరిస్తాడు. ఆ నమ్మకంతోనే సుకుమార్‌ ఉత్కంఠతో ఎదురుచూసేలా బలైమన పాయింట్‌తో ముగింపు ఇవ్వలేదేమో.

👉 పుష్ప 2లో సునీల్‌ పోషించిన మంగళం శ్రీను పాత్ర మరింత బలంగా చూపించే అవకాశం ఉంది. పార్ట్‌ 1లో మంగళం శ్రీను బామ్మర్థిని పుష్ప చంపేస్తాడు. అంతేకాకుండా సిండికేట్‌ లీడర్‌గా ఉన్న మంగళం శ్రీనుని పక్కకు జరిపి.. మాఫియా మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు పుష్ప. ముష్పరాజ్‌ని ఎదుర్కొనే దీటైన వ్యక్తిగా మంగళం శ్రీనుని చూపించే అవకాశం ఉంది.

👉 ఇక పార్ట్‌ 1లో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ సినిమా చివర్లో ఎంట్రీ ఇస్తాడు. పుష్పరాజ్‌ అతన్ని ఘోరంగా అవమానిస్తాడు. భన్వర్‌ సింగ్‌ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేది పార్ట్‌ 2లో చూపించనున్నారు. ‘పార్టీ ఉంది పుష్పా.. పార్టీ ఉంది’ అంటూ ట్రైలర్‌లో షేకావత్‌ పాత్రను బలంగా చూపించారు.

👉 కన్నడ నటుడు ధనుంజయ పోషించిన జాలిరెడ్డి పాత్రకు పార్ట్‌ 2లో మరింత ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. శ్రీవల్లీని బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో పుష్పరాజ్‌..జాలిరెడ్డిని చితక్కొడుతాడు. ఓ  కూలోడు తనను కొట్టడాన్ని జాలిరెడ్డి అవమానంగా భావిస్తాడు. ఎలాగైన పుష్పరాజ్‌ని చంపేయాలని డిసైడ్‌ అవుతాడు. మరి జాలిరెడ్డి తన పగను ఎలా తీర్చుకున్నాడనేది పుష్ప 2లో చూపించే అవకాశం ఉంది.

👉 పుష్పలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పార్ట్‌ 1లో పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ పుష్ప 2లో మాత్రం ఈ పాత్రను ఎలివేట్‌ చేసే చాన్స్‌ ఉంది. అనసూయ కూడా పలు ఇంటర్వ్యూలో పార్ట్‌ 2లో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెప్పింది.

👉 ఇక పుష్ప 1లో మొదటి నుంచి పుష్ప రాజ్‌కు ఇంటిపేరు లేదంటూ అవమానిస్తూ వస్తారు. సొంత అన్న(అజయ్‌) మొదలుకొని షేకావత్‌ వరకు పుష్పరాజ్‌కు ఇంటిపేరు లేదంటూ హేళన చేస్తుంటారు. పార్ట్‌ 2లో పుష్పరాజ్‌ ఇంటిపేరు సంపాదించే అవకాశం ఉంది. తనను అవమానించిన అన్నే అతనికి ఇంటిపేరు ఇచ్చే సీన్‌ ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా ఉటుందని టాక్‌. 

👉 పుష్పరాజ్‌ను పట్టుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. డీఎస్పీ గోవిందప్ప(శత్రు)కి పరాభావమే ఎదురవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక వేరే చోటుకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటాడు. తిరిగి పార్ట్‌ 2లో ఈ పాత్ర ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

👉 పార్ట్‌-1లో మురుగన్‌ ఓ వ్యక్తి అనుమతి కోసం వెయిట్‌ చేసినట్లు చూపిస్తారు. ఆ పాత్రను సుకుమార్‌ పూర్తిగా రివీల్‌ చేయలేదు. మరి ఆ కీలకపాత్రలో కనిపించేది ఎవరు? జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది పార్ట్‌ 2లోనే తెలుస్తుంది. 

👉 పార్ట్‌ 1లో శ్రీవల్లీ(రష్మిక) పాత్ర నిడివి కూడా అంతగా ఉండదు. కానీ సినిమా ముగింపులో పుష్ప శ్రీవల్లీని పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. పార్ట్‌ 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని ట్రైలర్‌లో  పుష్పరాజ్‌ చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక కూడా పార్ట్‌ 2లోనే తన పాత్ర నిడివి ఎక్కువ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. 

👉 జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌ అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి ఆ జాతరతో పుష్పరాజ్‌కు ఉన్న సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement