మలయాళ 'చిత్రపరిశ్రమ'లో మహిళలపై వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నటీమణులకు కేటాయించిన కారవాన్‌లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టారనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తాజాగా ఆమె మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
సిట్ అధికారులు ప్రశ్నించారు
రాడాన్ సంస్థ నిర్మిస్తున్న 'తాయమ్మ కుటుంబంతార్' సిరీస్ గురించి నటి రాధిక శరత్‌కుమార్, నటీనటులు ఈరోజు చెన్నైలోని సైదాపేటలోని సీఐటీ నగర్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో మీడియాతో ఇలా మాట్లాడారు. 'హేమ కమిటీకి సంబంధించి 4 రోజుల క్రితం నేను చేసిన ఆరోపణలు నిజమా కాదా అని సిట్ నన్ను ఫోన్‌లో ప్రశ్నించింది. వాటికి సమాధానం కూడా చెప్పాను. కానీ, నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆ సంఘటన ఘతంలో జరిగింది. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ మంది విద్యావంతులు వచ్చారు. దీంతో సినీ పరిశ్రమలో సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
కేరళ మాదిరి తమిళ ఇండస్ట్రీలో కూడా హేమ కమిటీ ఉండాలని కోరుతున్నాను. ఇండస్ట్రీలో ఏమైన సమస్యలు ఎదురైనప్పుడు కొందరు హీరోలు మనతో పాటు నిలబడితే.. కొందరు పట్టించుకోరు. సినిమా ఇండస్ట్రీ మహిళల కోసం మేము కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం.' అని రాధిక అన్నారు.
కేరళ సంఘటన గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదని రాధికను ప్రశ్నించగా.. 'దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలతో, మీడియాతో మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే కోర్టును ఆశ్రయించేందుకు కూడా నేను సిద్ధంగా లేను. అక్కడ కూడా న్యాయం జరగాలంటే చాలా రోజులు పడుతుంది. నిర్భయ కేసు 2012లో మొదలైతే.. 2020లో మాత్రమే దోషులకు శిక్ష పడింది. అని రాధిక గుర్తుచేశారు.
లైంగిక దాడులు జరిగితే నిర్మాతలదే బాధ్యత
సినీ నటీమణులపై లైంగిక దాడులు సమస్యలకు ఎవరు బాధ్యులన్న ప్రశ్నకు రాధికా ఇలా చెప్పుకొచ్చారు. ‘దీనికి నిర్మాతలే బాధ్యత వహించాలి. నటీమణులను సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత వారిదే. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎక్కడైనా పొరపాట్లు జరగొచ్చు. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కానీ మహిళలకు అండగా ఎవరూ నిలబడటంలేదు. లైంగిక ఆరోపణల విషయంలో పురుషుల తప్పులేదని ఈ సమాజం మాట్లాడుతోంది.
కానీ, నిందంతా మహిళలపైనే మోపుతున్నారు. మహిళల పట్ల సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యలను ప్రచురించే మీడియా సంస్థలను నిషేధించాలని నా విన్నపం. వారు ఎలాంటి విలేకరుల సమావేశానికి హాజరుకాకుండా బాయ్‌కాట్ చేయాలి. నిర్మాతల సంఘం, నటీనటుల సంఘం మధ్య నెలకొన్న సమస్యపై నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌తో కూడా ఇదే మాట్లాడాను. అని రాధిక అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment