బహుభాషా కథానాయికల్లో నటి రాశీఖన్నా ఒకరు. అలాగే అందాలను విచ్చలవిడిగా తెరపై గుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడని నటి కూడా. అయితే పలు చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ స్టార్ అంతస్తు కోసం పోరాడుతూనే ఉంది. బహుశ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించడంతో ఏ భాషలోనూ సరిగా దృష్టి సారించకపోవడం కారణం కావచ్చు. రాశీఖన్నా తమిళంలో నటించిన తొలి చిత్రం ఇమైకా నొడిగళ్. నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
తరువాత జయంరవికి జంటగా నటించిన అడంగ మరు, ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రంఫలం, కార్తీకి జంటగా సర్ధార్ చిత్రాల్లో నటించింది. కాగా తాజాగా ఈమె కథానాయకిగా నటించిన తమిళ చిత్రం అరణ్మణై 4. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో కథానాయకిగా తమన్న నటించింది. ఈ చిత్రంలో అందాలను ఆరబోయడంతో రాశీఖన్నా తమన్నతో పోటీ పడిందనే చెప్పాలి. ఏదేమైనా అరణ్మణై 4 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పుడీ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది.
ఈ సందర్భంగా నటి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ ఇప్పుడు తాను తమిళం, తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలనని చెప్పింది. తాను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని చెప్పింది. తాజాగా అరణ్మణై 4 (తెలుగులో బాకు చిత్రంలో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది. తాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నానని, భాష అర్ధం అయితే ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని తనకు తెలుసు అని పేర్కొంది. కాగా తనకిప్పుడు తెలుగు, తమిళం భాషలను అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పింది. కాబట్టి ఇకపై తనకు భాషా సమస్య లేదని చెప్పింది. తాను నటించిన కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా ఈ పయనం బాగుందనే అభిప్రాయాన్ని నటి రాశీఖన్నా వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment