ధనుష్‌కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్‌కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్‌ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్‌గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.
ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్‍తో ఇంటర్వెల్ పడుతుంది.
సెకండాఫ్‌లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.
ఎవరెలా చేశారు?
నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్‌కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్‌లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్‌గా చేసిన ఎస్‌జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్‌ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.
టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్‌గా ధనుష్‌ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!
రేటింగ్: 1.75
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment