సీరియల్ నటుడిగా కెరీర్ ఆరంభించిన రాజీవ్ ఖందేల్వాల్ ఐదేళ్లలోనే పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆమిర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన అతడు తొలి చిత్రంతోనే సక్సెస్ రుచి చూశాడు. సైతాన్, సౌండ్ ట్రాక్, టేబుల్ నెంబర్ 21, సామ్రాట్ అండ్ కో సహా బాలీవుడ్‌లో పలు సినిమాలు చేశాడు. హఖ్ సే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటాడు. నటుడిగా కాకుండా హోస్ట్‌గానూ అదరగొట్టాడు రాజీవ్. పలు రియాలిటీ షోలకు అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
తాజాగా అతడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడేనని చెప్పాడు. కేవలం ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చాడు. ఓసారి తనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని, అప్పుడు తాను తడబడకుండా సారీ బాస్, మీరు చెప్పినట్లు నేను చేయలేను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశానన్నాడు. అబ్బాయిలు ఇలాంటి పరిస్థితులను డీల్ చేసినంతగా అమ్మాయిలు డీల్ చేయలేరన్నాడు. కొన్నిసార్లు వాళ్లు పరిస్థితులకు లొంగిపోయి తమలో తామే కుమిలిపోతారని, కానీ మగవాళ్లు వాటికి ఎదురొడ్డి నిలబడి ముందుకు సాగుతారని, కాకపోతే ఆ విషయాలను బయటకు చెప్పరని పేర్కొన్నాడు.
అలాగే ఎప్పుడు చూసినా మహిళల రక్షణ కోసమే మాట్లాడతారు కానీ సినీ ఇండస్ట్రీలో మగవాళ్ల రక్షణ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరని తెలిపాడు. పురుషాధిపత్యం వల్ల అమ్మాయిలే ఎక్కువగా నలిగిపోతున్నారు కాబట్టి వారి గురించే ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త చూపించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డాడు. కానీ ప్రస్తుత చిత్రపరిశ్రమ మునుపటిలా లేదని, చాలా మారిందని చెప్పుకొచ్చాడు రాజీవ్.
Comments
Please login to add a commentAdd a comment