కామెడీ హీరోగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. కామెడితో హీరోయిజం కూడా పండించొచ్చని నిరూపించిన ఏకైక నటుడు ఆయన. ఇప్పుడంటే చాలా మంది కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు కానీ.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఒక్కరే కామెడీ హీరో.
నవ్వుల రారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 ఏళ్లుగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నట కిరీటీ సపోర్టింగ్ యాక్టర్‌గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తెరపై నవ్వులు పూయించిన ఈ సీనియర్ హీరో.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా కష్టాలు అనుభవించాడట. తాజాగా ఆయన ఓ టీవీ షోలో పాల్గొని..తన చిన్ననాటి కష్టాలను తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
‘నా చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను అమ్మకోసం ఎదురుచూస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. రోజు అమ్మకోసం ఏడ్చేవాడిని. ఒకనొక దశలో చనిపోయే స్టేజ్‌కి వచ్చాను. అప్పుడు నా పరిస్థితి చూసి..మా ఇంట్లోవాళ్లు కనక దుర్గమ్మ గుడికి తీసుకెళ్లారు. అమ్మవారిని చూపిస్తే.. ఇకపై ఈమే నీ అమ్మ అని చెప్పారు. అమ్మ బయటకు రాదు..ఇక్కడే ఉంటుంది అని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ కనకదుర్గమ్మనే అమ్మగా భావించి పెరిగాను’ అని చెబుతూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.
రాజేంద్ర ప్రసాద్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘#కృష్ణారామా’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమి కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 22న ప్రముఖ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment