అమితాబ్‌ బచ్చన్‌ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు: రజనీకాంత్‌ | Rajinikanth Comments On Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ బచ్చన్‌ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు: రజనీకాంత్‌

Published Sat, Sep 21 2024 5:41 PM | Last Updated on Sat, Sep 21 2024 6:17 PM

Rajinikanth Comments On Amitabh Bachchan

రజనీకాంత్‌ , అమితాబ్‌ బచ్చన్‌ ఇద్దరూ మంచి స్నేహితులేనని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో 'హమ్‌, అందాకా నూన్‌, గిరాఫ్తార్‌' వంటి సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, 32 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా 'వెట్టైయాన్‌'. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ వేదికపై తన మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌ గురించి రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ మాట్లాడుతూ.. 'అమితాబ్‌ బచ్చన్‌ సినీ నిర్మాతగా భారీ అర్ధిక నష్టాలను చవిచూశారు. ఒకానొక సమయంలో తన వాచ్‌మెన్‌కు కూడా జీతం ఇవ్వలేని స్థితికి చేరిపోయారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన  జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. అప్పడు బాలీవుడ్‌ మొత్తం ఆయన్ను చూసి నవ్వింది. పతనమైనప్పటికీ సరిగ్గా మూడేళ్లలో తిరిగి మళ్లీ నిలబడ్డారు. 

కౌన్‌ బనేగా కరోడ్‌పతి నుంచి చేతికి వచ్చిన ప్రతి యాడ్‌ చేస్తూ కష్టపడ్డారు. అందుకోసం ఆయన చాలా శ్రమించారు. 82 ఏళ్ల వయసులో కూడా రోజుకు 10 గంటలకు పైగానే కష్టపడ్డారు. తను ఎక్కడైతే కిందపడ్డారో మళ్లీ అక్కడే తనేంటో చూపించారు.  జూహూలోని తన ఇంటితో పాటు మరో  మూడు ఇళ్లను తిరిగి కొనుగోలు చేశారు.' అని రజనీ చెప్పారు.

గాంధీ కుటుంబంతో అమితాబ్‌ బంధం: రజనీకాంత్‌
అమితాబ్‌ బచ్చన్‌ గురించి మాట్లాడుతూ ఒక అరుదైన విషయాన్ని రజనీకాంత్‌ ఇలా పంచుకున్నారు. ఒకసారి అమితాబ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అప్పుడే అందరికీ తెలిసింది. అలా గాంధీ కుటుంబంతో ఆయనకు దగ్గరి పరిచయాలు ఉన్నాయని అప్పుడే తెలిసింది.  

అమితాబ్ జీ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప రచయిత. తనకు కష్టం వచ్చినప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఎవరినైనా సాయం అడగొచ్చు. కానీ, ఆయన అలాంటి పనిచేయలేదు. కష్టాల్లో కూడా తనంతట తానే తిరిగి మళ్లీ నిలబడ్డారు. అమితాబ్‌ ఎందరికో ఆదర్శం.

దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న  థియేటర్స్‌లోకి ‘వేట్టైయాన్’ రానున్నాడు. రజనీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్‌ నిర్మించారు. వేట్టయాన్‌లో సత్యదేవ్  పాత్రలో అమితాబ్ నటించారు.  రితికా సింగ్, దుషార విజయన్, మంజు వారియర్ , రానా దగ్గుబాటి,  ఫహద్ ఫాసిల్  నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement