
రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రం). శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి ప్రధాన పాత్రల్లో ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ –‘‘ఆ మధ్య జరిగిన ఒక వాస్తవ ప్రేమ హత్య ఉదంతం నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎవరినీ కించపరచాలని ఈ చిత్రాన్ని తీయలేదు.. భావ స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని వాస్తవ ఘటనతో వర్మ రూపొందించారు. మా ట్రైలర్ విడుదలైన కొద్ది సమయానికే విశేష ఆదరణకు నోచుకుంది. ఆగస్ట్‌కి తొలి కాపీ సిద్ధమవుతుంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్, సంగీతం: డిఎస్‌ఆర్.