రానా
‘‘కోవిడ్ తర్వాత మన తెలుగు పరిశ్రమే గాడిలో పడింది. ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనూ ఇలా లేదు. సినిమాలు రిలీజ్ చేసిన వెంటనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు. అలాగే తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది’’ అన్నారు రానా. ప్రభు సాల్మన్ డైరెక్షన్‌లో రానా ప్రధాన పాత్రలో ఈరోస్ ఇంటర్‌నేషనల్స్ నిర్మించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, ప్రియా పింగోల్కర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ’ రిలీజ్‌ను వాయిదా వేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో రానా చెప్పిన విశేషాలు.
►దర్శకుడు ప్రభు సాల్మన్ మన భూమి కోసం, భవిష్యత్ తరాల కోసం పోరాడే వ్యక్తి కథ ‘అరణ్య’ అనగానే ఆసక్తికరంగా అనిపించింది. ఏనుగుల వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతుంది. అది మన భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది. అందుకే ‘అరణ్య’ భవిష్యత్ తరాలకు కూడా చెప్పాల్సిన కథ. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజులు ముందుగానే థాయ్‌ల్యాండ్‌కు వెళ్లాం. కథ గురించి చెప్పి 18 ఏనుగులతో షూట్ చేయాల్సి ఉంటుంది అన్నారు ప్రభు. ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ఏనుగుల సంరక్షకుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా ఒక ఏనుగు మన పక్కన నడిస్తేనే భూమి కంపిస్తుంది. అలాంటిది ఒకేసారి 18 ఏనుగులతో కలిసి ఉంటూ, షూటింగ్ చేశామంటే మేం ఎంత కష్టపడి ఉంటామో ఊహించుకోవచ్చు.
►ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదొచ్చాక జాదవ్ పయేంగ్‌ని అరణ్య అని పిలుస్తుంటారు. అందుకే మా సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. జాదవ్ పయేంగ్, ఎలిఫెంట్ విస్పరర్‌గా పిలవబడే లారెన్స్ ఆంథోనీ జీవితాల్లోని సంఘటనలు, కాజీరంగా ఘటనను కూడా ఈ సినిమాలో చూపించాం.
►ప్రతి సినిమా ఎంతో కొంత మార్పు తీసుకువస్తుంది. ఈ సినిమా కోసం అడవుల్లోకి వెళ్లొచ్చాక నేను పెళ్లి చేసుకున్నాను. ఇంతకన్నా మార్పు ఏం ఉంటుంది (నవ్వుతూ).
►స్పీడ్‌గా సినిమాలు చేయాలనుకుంటాం. ‘బాహుబలి’ సినిమాని రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటే ఐదేళ్లయింది. ‘అరణ్య’కు మూడేళ్లు పట్టింది. ఈ ఏడాది నావి మూడు సినిమాలు విడుదలవుతాయి. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లో నటిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment