
‘‘దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ– ‘‘కరణ్ మల్హోత్రాగారు ‘షంషేరా’ స్క్రిప్ట్ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో బల్లి, షంషేరా వంటి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను. ఇలాంటి సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.
కరణ్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘షంషేరా’ ఫిక్షనల్ కథ. 1871లో ఓ ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్‌గా పాత్రలు, కథ రూపొందించాం. మా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ‘‘షంషేరా’లో శుద్ సింగ్ అనే డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు సంజయ్ దత్. ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ‘షంషేరా’లోని పాత్ర పూర్తి భిన్నమైనది. నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు వాణీ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment