ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి బుధవారం షాయరీ రిలీజ్ అయింది. నేనొక నటుడ్ని అని చిరంజీవి గళం నుంచి వెలువడిన ఈ కవిత అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ కవితకు లక్ష్మీ భూపాల్ అందమైన అక్షరరూపమిచ్చారు.
ఈ షాయరీ వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా రాశారు. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయరీకి ప్రాణం పోశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ సినిమాకు ఈ షాయరీ అద్దం పడుతోంది.
చిరంజీవి భావోద్వేగంతో చెప్పిన కవిత ఇదే..
నేనొక నటుడ్ని
చంకీల బట్టలేసుకుని అట్టకిరీటం పట్టుకుని చెక్క కత్తి పట్టుకుని
కాగితం పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతను నేను
నేనొక నటుడ్ని..
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని
నేనొక నటుడ్ని
నవ్విస్తాను ఏడిపిస్తాను ఆలోచనా సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి నవరసాలు మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను
నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకు మరణిస్తాను
పోయినా బతికుంటాను
నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాణ్ణి
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోన్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని
నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూట పూటకు రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను
నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యమాడే నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండ నేను
నేనొక నటుడ్ని
అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ తొమ్మిది తలలు ఉన్న నటరాణుడ్ని
నింగీనేల రెండడుగులైతే మూడో పాదం మీ మనసులపై మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహున్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడిని
అందుబాటు చంద్రుడిని
అభిమానుల దాసుడిని
అందరికీ ఆప్తుడిని
చప్పట్లను భోంచేస్తూ ఈలలను శ్వాసిస్తూ అణుక్షణం జీవించే అల్ప సంతోషిని నేను
మహా అదృష్టవంతుడిని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుడిని నేను
ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు..
చదవండి: షారుక్‌ను సజీవం దహనం చేస్తాం: అయోధ్య సాధువు వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment