Rangamarthanda Movie
-
రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్
‘నాటు నాటు’సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆ ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం రాహుల్‌లో ఉంది. ఆస్కార్ అవార్డు సాధించినా.. ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్పాడు. నాకు రజకాంత్ అంటే చాలా ఇష్టం. రంగమార్తాండ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ గార్లతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూట్లో ఉన్నప్పుడు.. నేను రజనీ ఫ్యాన్ అని ప్రకాశ్ రాజ్‌కు చెప్పాను. దీంతో ఓ సారి ప్రకాశ్ రాజ్ నన్ను పిలిచి రజనికాంత్ మూవీ షూటింగ్‌కి వెళ్తున్నా రమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్లిపోయాను. అప్పుడు అన్నాత్తే షూటింగ్ జరుగుతోంది. విరామం సమయంలో రజనీకాంత్ సర్కి నన్ను పరిచయం చేశారు. అయితే అప్పుడు ఆయన ఆ మూవీ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. అయినా కూడా నాకు ఫోటో దిగే అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఆ సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా విడుదల కాలేదు. ఈ విషయం నాకు చెప్పి సినిమా రిలీజ్ వరకు ఆ ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. ఓ పది రోజుల తర్వాత ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశా. అది వైరల్‌గా మారింది. హీరో లుక్ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశాను. -
బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ... చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు.
-
అనసూయ ఓవర్ యాక్షన్ చూడండి
-
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్‌తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రంగమార్తాండ, ఎక్కడంటే?
కొన్ని సినిమాలు బాగుంటాయి. కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డులకు అతీతంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాయి. వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రంగమార్తాండ. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మధు, వెంకట్ రెడ్డి నిర్మించారు. మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నటసామ్రాట్‌కు ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రసారమవుతోంది. కథ విషయానికి వస్తే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. ఆయన ప్రతిభకు మెచ్చి అభిమానులు రంగమార్తాండ బిరుదు ప్రదానం చేస్తారు. అయితే ఆ సత్కార సభలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిస్తాడు. తన ఆస్తులను కూడా పిల్లలకు పంచేస్తాడు. కొడుకు, కోడలికి ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, కూతురికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్మును అప్పగిస్తాడు. ప్రేమించినవాడితో పెళ్లి కూడా చేస్తాడు. అన్ని బాధ్యతలు తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి ఆయన శేష జీవితం ఆనందంగా సాగిందా? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు? అతడి నిజజీవితం ఎలా ముగిసిందనేది మిగతా కథ. story of an extraordinary theatre artist and the unexpected changes in his life when he decides to retire ✨#RangaMaarthaandaOnPrime, watch now https://t.co/woDFJ0AJwD pic.twitter.com/0vQgtKa4NB — prime video IN (@PrimeVideoIN) April 7, 2023 -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
అమ్మనాన్నలతో అంతగా కనెక్షన్ లేదు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కృష్ణవంశీ మార్క్ మరోసారి కనిపించిదంటూ సినీ ప్రముఖులు పొడగ్తలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో రంగమార్తాండ సక్సెస్ గురించి కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి వస్తున్న ఆదరణ గతంలో చూస్తుంటే ముచ్చటేస్తుంది. గతంలో నేను చేసిన సినిమాల కంటే రంగమార్తాండ ప్రత్యేకం. చిరంజీవి లాంటి దిగ్గజ నటుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. సోసల్ మీడియాలోనూ ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. రిలీజ్‌కు ముందు అంతగా ప్రచారం చేయకున్నా మంచి కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రంగమార్తాండతో మరోసారి రుజువు అయ్యింది. ఇది 'ఇది మన అమ్మానాన్నల కథ' అని క్యాప్షన్ ఇవ్వడంతో ఆడియెన్స్ మరింత కనెక్ట్ అయ్యారు. అయితే సినిమాకి, నా పర్సనల్ లైఫ్‌కి చాలా తేడా ఉంది. మా నాన్న చాలాకాలం క్రితమే చనిపోయారు. మా అమ్మ మాత్రం నాతోనే ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను మా పేరెంట్స్‌తో అంతగా కనెక్టెడ్‌గా లేను.ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. రియల్ లైఫ్‌లో బ్యాడ్ సన్ని. ఇంట్లోవాళ్ల విషయానికి వస్తే.. ఎవరితోనూ అంత క్లోజ్‌గా మాట్లాడను'' అంటూ కృష్ణవంశీ పేర్కొన్నారు. -
సెకండాఫ్ అంతా కంటతడి: రంగమార్తాండపై చిరంజీవి రివ్యూ
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చాడు. 'రంగమార్తాండ సినిమా చూశాను. ఇటీవలి కాలంలో వచ్చినవాటిలో ఓ ఉత్తమ చిత్రమిది. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్ని కళ్ల ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. కృష్ణవంశీలాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి అద్భుత నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్య పాత్రను చేయడం ఇదే తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించాలి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాశ్ రాజ్‌కు, రమ్యకృష్ణకు చిత్రయూనిట్ అందరికీ అభినందనలు' అంటూ ట్విటర్లో రంగమార్తాండ టీమ్‌కు అభినందనలు తెలియజేశాడు చిరు. Kudos to #Rangamarthanda 👏👏@director_kv @prakashraaj #Brahmanandam @meramyakrishnan pic.twitter.com/spjo5FZlWw — Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2023 -
బ్రహ్మానందం 20 టేకులు చెప్పినా చేసేవారు: కృష్ణవంశీ
‘‘ప్రతి నటుడిలో విభిన్న కోణాలు ఉంటాయి. వాటిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడం నాకు ఇష్టం. విలన్‌గా చేస్తున్న చలపతిరావుగారిని ‘నిన్నే పెళ్లాడతా’లో మంచి తండ్రిగా చూపించాను. బ్రహ్మానందంగారిలోని మరో నటుణ్ణి ‘క్షణం క్షణం’లో చూశాను. అందుకే ‘రంగ మార్తాండ’లోని చక్రి పాత్రలో ఆయన్ని ఊహించుకునే ధైర్యం చేశా.. ఆయన పాత్ర అద్భుతంగా వచ్చింది’’ అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ఆదర్శ్, అనసూయ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ ప్రకాశ్‌రాజ్‌కి బాగా నచ్చింది. నన్నా సినిమా చూసి, స్క్రీన్‌ప్లేలో సాయం చేయమన్నాడు. నాలాంటి రాక్షసుడితోనే కంటతడిపెట్టించిన చిత్రమిది. ఆ తర్వాత నాకు తోచిన మార్పులు ప్రకాశ్‌రాజ్‌కి చెబితే.. ‘ఈ సినిమాకి నువ్వే దర్శకత్వం వహిస్తే బాగుంటుంది’ అనడంతో ఓకే అన్నాను. మనుషులపై నాకు ఇంకా నమ్మకం పోలేదు. ఓ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారనే నా నమ్మకాన్ని వారు ‘రంగమార్తాండ’ ద్వారా నిజం చేశారు. 1250కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందంగారు ఒక్కో సీన్‌కి పదీ ఇరవై టేకులు చెప్పినా చేసేవారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంగారి నటన, ఇళయరాజాగారి సంగీతం సినిమాకి హైలైట్. శివాత్మిక, అనసూయ, రాహల్, ఆదర్స్ బెస్ట్ ఇచ్చారు. చిరంజీవిగారి వాయిస్ ఓవర్ ప్లస్సయింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బ్రహ్మానందం. -
ఓటీటీలో రంగమార్తాండ.. అప్పుడే రిలీజ్!
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల థియేటర్లలో అలరిస్తోంది. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి ప్రశంసలు
ఆడియెన్స్‌ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్ బ్రహ్మానందం. స్క్రీన్‌పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్ హీరోలకు ధీటుగా రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. -
ఆయన నటనలోని మ్యాజిక్‌ని చూశా: ప్రకాశ్‌రాజ్
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు. ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్‌ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్‌రాజ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్‌ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. -
Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ
టైటిల్: రంగమార్తాండ నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం : కృష్ణవంశీ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి విడుదల తేది: మార్చి 22, 2023 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్‌బ్యాక్ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్మెంట్ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్)కి తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్ సిప్లిగంజ్)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు. ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మారాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్‌తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్’ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు. తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్ చాలా ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరెలా చేశారంటే.. ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్ప్రైజింగ్ ప్యాకెజ్. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్లో ప్రకాశ్‌రాజ్‌ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎందుకు ఈ సినిమా.. ఎవరు చూస్తారని అడిగా : రమ్యకృష్ణ
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సినిమా ప్రారంభానికి ముందు ‘అసలు ఇలాంటి చిత్రాలను ఇప్పుడు ఎవరు చూస్తారు?’ అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన మొండి కదా.. వినిపించుకోకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. ఇందులో నేను పోషించిన పాత్ర కోసం మొదటగా చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో..చివరకు నేను ఆ పాత్ర చేస్తానని ముందుకొచ్చా. కళ్లతోనే నటించాలని చెప్పారు. అలానే నటించాను. నా పాత్ర నిడివి అంత ఉంటుందని ఊహించలేదు. ఎమోషనల్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తుండగానే.. భావోద్వేగానికి లోనయ్యాం. ప్రతి సీన్ హృదయాలను హత్తుకునేలా తిశాడు. వంశీ కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుంది’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్‌గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
ఉగాదికి రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లివే!
వినోదాన్ని పంచేందుకు ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు.. అలా అని రిలీజైన ప్రతి సినిమాను థియేటర్లో చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! అందుకే మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లో చూసి చిల్ అవుతున్నారు ప్రేక్షకులు. సమయం దొరికితే ఓటీటీ కంటెంట్ ఆస్వాదిస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు జనాలు. గత వారం రిలీజైన సినిమాలు ఇంకా బాక్సాఫీస్ దగ్గర ఆడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఈ వారం నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం చెప్తూ కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఈ పండగ రోజు(మార్చి 22)తో పాటు ఈ వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లేంటో చూద్దాం.. థియేటర్లో సందడి చేసే చిత్రాలు.. ► రంగమార్తాండ- మార్చి 22 ► ధమ్కీ- మార్చి 22 ► ఘోస్టీ- మార్చి 22 ► గీత సాక్షిగా- మార్చి 22 ► జాన్ విక్ చాప్టర్ 2- మార్చి 24 ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు.. ఆహా ► వినరో భాగ్యము విష్ణు కథ - మార్చి 22 ► డిసిడెంట్స్ ఆఫ్ ద సన్ (కొరియన్ డ్రామా) - 24 నెట్‌ఫ్లిక్స్ ► వి లాస్ట్ అవర్ హ్యూమన్ (మొదటి సీజన్) మార్చి 21 ► జానీ - మార్చి 23 ► క్లోజ్ టు హోమ్: మర్డర్ ఇన్ ద కోల్‌ఫీల్డ్ (మొదటి సీజన్)- మార్చి 22 ► ఇన్విజిబుల్ సిటీ (రెండో సీజన్)- మార్చి 22 ► ఐ సీయూ (2019)- మార్చి 22 ► ద కింగ్డమ్/ ఎల్ రినో (మూడో సీజన్)- మార్చి 22 ► వాకో: అమెరికన్ అపోకాలిప్స్ - మార్చి 22 ► ఫ్యూరీస్ - మార్చి 23 ► జానీ- మార్చి 23 ► ద నైట్ ఏజెంట్- మార్చి 23 ► చోర్ నికల్ కె భంగా - మార్చి 24 ► ఐయామ్ జార్జినా- మార్చి 24 ► లవ్ ఈజ్ బ్లైండ్ - మార్చి 24 ► హై అండ్ లో: ద వరస్ట్ క్రాస్ - మార్చి 25 ► పార్టర్న్స్ ఇన్ క్రైమ్ - మార్చి 25 -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానంతం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య పాత్రలు పోషించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిలిం నటసామ్రాట్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రమ్యకృష్ణ పాత్ర పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశా. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ, నేను పెద్దగా పట్టించుకోను.. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్‌తో ముందుకెళ్తుంది. ఈ సినిమాలో లాస్ట్ చాప్టర్లో తనను షూట్ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్ జరిగింది. తనను ఆ సీన్లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు కృష్ణవంశీ. -
నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సునీత ఆత్మ విశ్వాసంతో ముందకెళ్లారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సునీత మాట్లాడుతూ... 'ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశా. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఈ సినిమాలో పాత్రలను కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూశాక గుండె బరువెక్కిపోయింది. అంతే కాకుండా గుబులు మొదలైంది. కానీ ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటివి డైరెక్టర్ కృష్ణవంశీకే సాధ్యం. రంగమార్తాండ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా కచ్చితంగా ఈ సినిమా చూడండి. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి'. అంటూ ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి:కేజీఎఫ్ హీరోయిన్ను వేధించిన యశ్?.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి) కాగా..సునీతకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'రంగ మార్తాండ' ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఆయన భార్య రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. సినీ ప్రముఖుల కోసం ఈ చిత్రం స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షించిన సింగర్ సునీత ఎమోషనలయ్యారు. ఇలాంటి సినిమా చూస్తుంటే తన గుండెలో గుబులు మొదలైందని అన్నారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
Rangamarthanda : కృష్ణవంశీ ఫార్ములా బాక్సాపీస్ దగ్గర వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ బ్రాండ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. నక్షత్రం మూవీ తర్వాత ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్ గా కృష్ణ వంశీ రంగమార్తాండ తెరకెక్కించాడు. నటసామ్రాట్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. కరోనా కి ముందు మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న రంగమార్తాండ మార్చి 22న విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ ప్రేక్షకులను మెప్పించగలడా అనే సందేహాలు టీటౌన్లో వినిపిస్తున్నాయి. కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ సీన్స్ తోనే ప్రేక్షకులను స్టోరీకి కనెక్ట్ చేయాలని చూస్తాడు కృష్ణ వంశీ. అయితే ప్రజెంట్ ప్రేక్షకుల ట్రెండ్ మారింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాక్షన్ ఉన్న కథల పైన ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక ఫ్యామిలీ టైపు మూవీస్ పై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి కృష్ణవంశీ ఈ మూవీతో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా రంగమార్తాండ విడుదలైన రోజే విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ రిలీజ్ కానుంది. ఆ తర్వాతి వారంలో నాని తొలి పాన్ ఇండియా మూవీ దసరా విడుదల కాబోతుంది. ధమ్కీ, దసరాల మధ్య రంగమార్తాండ రిలీజ్ చేయటం కొంచెం రిస్క్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే రంగమార్తాండ సినిమా అనుకున్నంత హైప్ రాలేదు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ షాయరీ కూడా ఆలపించారు. అయినా ఈ మూవీకి ఎలాంటి బజ్ రాలేదు. ఇక కృష్ణ వంశీ రంగమర్తాండ మూవీకి హైప్ తెచ్చేందుకు రకాలు ప్రయత్నాలు చేసినా ... అవి ఎలాంటి బజ్ తీసుకురాలేదు. చివరిగా కృష్ణవంశీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ సినిమా ప్రీమియర్ షో వేసి ప్రమోట్ చేయటంతో...మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ చేసుందుకు స్టెప్ తీసుకుంది. ఇక రంగమార్తాండ ప్రీమియర్ చూసిన సెలబెట్రీస్ నుంచి పాజిటివ్ రివ్యూస్ రావటం ఈ సినిమాకి ప్లస్ గా మారింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా పై డైరెక్టర్ కృష్ణవంశీ భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే రంగమార్తాండ లాంటి సాఫ్ట్ కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. -
రంగమార్తాండ వచ్చేస్తున్నాడు
థియేటర్స్‌కు రావడానికి రెడీ అయ్యాడు రంగ మార్తాండ. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ‘‘ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం..’ అని పేర్కొన్నారు దర్శకుడు కృష్ణవంశీ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు ΄ోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ రూ΄÷ందింది. -
స్టార్ డాటర్‌తో రాహుల్ సిప్లిగంజ్.. వీడియో సాంగ్ విడుదల
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రంగమార్తాండ.కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్‌కు జోడీగా శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే..పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. -
నన్ను క్షమించగలవా?
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్‌తో గ్లింప్స్ సాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా.