‘‘ప్రతి నటుడిలో విభిన్న కోణాలు ఉంటాయి. వాటిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడం నాకు ఇష్టం. విలన్‌గా చేస్తున్న చలపతిరావుగారిని ‘నిన్నే పెళ్లాడతా’లో మంచి తండ్రిగా చూపించాను. బ్రహ్మానందంగారిలోని మరో నటుణ్ణి ‘క్షణం క్షణం’లో చూశాను. అందుకే ‘రంగ మార్తాండ’లోని చక్రి పాత్రలో ఆయన్ని ఊహించుకునే ధైర్యం చేశా.. ఆయన పాత్ర అద్భుతంగా వచ్చింది’’ అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ఆదర్శ్, అనసూయ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ ప్రకాశ్‌రాజ్‌కి బాగా నచ్చింది. నన్నా సినిమా చూసి, స్క్రీన్‌ప్లేలో సాయం చేయమన్నాడు.
నాలాంటి రాక్షసుడితోనే కంటతడిపెట్టించిన చిత్రమిది. ఆ తర్వాత నాకు తోచిన మార్పులు ప్రకాశ్‌రాజ్‌కి చెబితే.. ‘ఈ సినిమాకి నువ్వే దర్శకత్వం వహిస్తే బాగుంటుంది’ అనడంతో ఓకే అన్నాను. మనుషులపై నాకు ఇంకా నమ్మకం పోలేదు. ఓ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారనే నా నమ్మకాన్ని వారు ‘రంగమార్తాండ’ ద్వారా నిజం చేశారు. 1250కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందంగారు ఒక్కో సీన్‌కి పదీ ఇరవై టేకులు చెప్పినా చేసేవారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంగారి నటన, ఇళయరాజాగారి సంగీతం సినిమాకి హైలైట్. శివాత్మిక, అనసూయ, రాహల్, ఆదర్స్ బెస్ట్ ఇచ్చారు. చిరంజీవిగారి వాయిస్ ఓవర్ ప్లస్సయింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బ్రహ్మానందం.
Comments
Please login to add a commentAdd a comment