పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్‌తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్‌లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు.
మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment