ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సంచలనం సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమెడియన్ వేణు యెల్లండి తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషిస్తుంటారు. తాజాగా ఆయన ‘బలగం’ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూసి తనకు కూడా కన్నీళ్లాగలేదని తెలిపారు. చిత్ర దర్శకుడు వేణు, పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ను ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు.
పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమాకు ఏది బలమో అదే ఇందులో ఉంది. ఇదొక వినూత్నమైన ప్రయోగం. నిజానికి సినిమా చేసేటప్పుడు ఇంతటి విజయం సాధిస్తుందని దిల్‌రాజు కూడా ఊహించి ఉండరు. ఖర్చు పెట్టిన దాని కంటే పదిరెట్లు ఎక్కువే వసూళ్లు రాబట్టింది. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. కథను మాత్రమే నమ్ముకోవాలి. చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెటా? అనేది విషయం కాదు. పెద్ద బడ్జెట్ సినిమాతో సమానంగా నిలిచింది ఈ బలగం. వేణులో ఇంత గొప్ప రచయిత ఉన్నాడా అసలు ఇది ఊహించలేదు. ' అని అన్నారు.
వేణు గురించి మాట్లాడుతూ.. 'వేణుని ‘జబర్దస్త్’ కమెడియన్‌గా మాత్రమే చూశా. వేణులో ఇంత గొప్ప రచయిత, ఇంత సృజనాత్మకత ఉందా? అనిపించింది. కామెడీ చేసే కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా తీయగలడా అనేది ఊహకందని అంశం. వేణు చేసిన మాయ ఏంటంటే.. సినిమా మొదటి నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమా తీయొచ్చు. కానీ అతను అలా చేయలేదు. నవ్విస్తూనే.. చివరకు భావోద్వేగానికి గురి చేశాడు.' అని అన్నారు.
(ఇది చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు)
నేను కూాడా కన్నీళ్లు పెట్టుకున్నా
పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా అరుదు. ఈ మూవీ చూసి నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు మనం కన్నీళ్లు పెడతాం. కానీ ఇందులో కుటుంబ సభ్యులు కలిసేటప్పుడు భావోద్వేగానికి గురవుతాం. ఇది ఓ అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఒక మనిషి చనిపోయాక 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయరు. ఇలాంటి సినిమాలు చూస్తారా? అని భయపడతారు. అలాంటి భయాలేమీ లేకుండా వేణు అద్భుతంగా తెరకెక్కించాడు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment