సినిమా అనే పవర్‌ఫుల్ మీడియాలో సక్సెస్‌ఫుల్ హీరో హీరోయిన్లకు ఉండే క్రేజే వేరు. అయితే వాళ్లు మామూలు మనుషులే. సమస్యలు అనే వాటికి వారు అతీతులు కారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెతలా వ్యక్తిగత సమస్యలతో పాటు కొందరు చర్యలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు నటీమణుల గురించి వదంతులు ప్రచారం చేయడం జరుగుతూ వస్తోంది. అయితే తాజాగా డీప్ ఫేక్ అనేది వారిని వేదనకు గురిచేస్తోంది.
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏఐ అనే టెక్నాలజీతో హీరోయిన్లను నకిలీ ముఖాలను (డీప్ ఫేక్) రూపొందించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి వాటిని రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్, అభిరామి వంటి ప్రముఖ తారలు ఎదుర్కొంటున్నారు. ఫేక్ వీడియోలపై రష్మిక మందన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ డీప్ ఫేక్ వీడియోలు నానాటికి పెరుగుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ప్రశ్నిస్తే ఇలాంటివన్నీ కోరుకునే కదా మీరు వృత్తిలోకి వచ్చారు అని అంటున్నారన్నారు. ఇతర అమ్మాయిలకు ఇలాంటివి ఎదురైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందన్నారు. దీని గురించి తనలాంటి వాళ్లు మాట్లాడితే డీప్ ఫేక్ అంటే ఏమిటి, ఇలాంటివి కరెక్టేనా అనే అంశాలపై కొందరు మహిళలకైనా తెలిసే అవకాశం ఉంటుందన్నారు. అసలు ఈ డీప్ ఫేక్ అనే విషయం గురించి అవగాహన కలగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని రష్మిక మందన్న వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment