ద్రౌపది, రుద్రతాండవం చిత్రాల ఫేమ్ నటుడు రిచర్డ్ రిషి, పున్నగై పూ గీత, యషికా ఆనంద్ హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం సిలనొడిగళిల్. ఎస్కైర్ ప్రొడక్షన్స్ యూకే సంస్థతో కలిసి పున్నగై పూగీత నిర్మించిన ఈ చిత్రానికి వినయ్ భరద్వాజ్ కథ, దర్శక బాధ్యతలను నిర్వహించారు. ఐదుగురు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఇది సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందన్నారు.
ఇందులో రిచర్డ్ రిషి లండన్‌లో పేరొందిన కాస్మోటిక్ సర్జన్‌గా నటించారన్నారు. పున్నగై పూగీత, రిచర్జ్ రిషి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారన్నారు. అలాంటి సమయంలో ప్రముఖ మోడల్ నటి యషికా ఆనంద్ అతనికి పరిచయం అవుతుందన్నారు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడుతుందన్నారు. ఆ తర్వాత యషికా ఆనంద్ హత్యకు గురవుతుందని, ఆమెను ఎవరు ఎందుకు హత్య చేశారన్నదే చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు.
ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుందని లండన్ నేపథ్యాన్ని చిత్రానికి ఎంచుకున్నట్లు చెప్పారు. ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించిన యషికా ఆనంద్ ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రలో అద్భుతంగా నటించారని, రిచర్డ్ రిషి తన పాత్రకు న్యాయం చేశారని నిర్మాత తెలిపారు. సిల నొడిగళిల్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం చిత్రం టీజర్, ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment