రింకు రాజ్‌గురు అకా ప్రేరణ రాజ్‌గురు.. ఎక్కడో చూసినట్టు ఇంకా చెప్పాలంటే మనింట్లోని అమ్మాయే అనిపించేట్టుంది కదా! 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ మరాఠీ సినిమా గుర్తుందా.. అదే ‘సైరాట్’. అందులో కథానాయికే ఈ రింకు రాజ్‌గురు. ‘సైరాట్’ తర్వాత దాని కన్నడ రీమేక్ ‘మనసు మల్లిగే’, కిందటేడు ‘కాగర్’ అనే ఇంకో మరాఠీ, ‘ఝుండ్’ హిందీ సినిమాల్లోనూ నటించాక ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీదా తన ప్రతిభను పరిచయం చేసుకుంది. డిస్నీ హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘హండ్రెడ్’లో.
- పుట్టింది, పెరిగింది మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్‌లో. తల్లిదండ్రులు.. ఆశా రాజ్‌గురు, మహాదేవ్ రాజ్‌గురు. ఇద్దరూ టీచర్లే. రింకూకు ఓ తమ్ముడు సిద్ధార్థ రాజ్‌గురు.
- ‘సైరాట్’ విడుదలయ్యే సమయానికి రింకూ తొమ్మిదో తరగతిలో ఉంది. ఆ సినిమా విజయంతో ఇబ్బడిముబ్బడి అవకాశాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినా చదువు మీద దృష్టి మరల్చలేదు. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. భద్రతా కారణాల దృష్ట్యా స్కూల్‌కి వెళ్లి చదువు కొనసాగించలేకపోయింది. ప్రైవేట్ ట్యూషన్స్‌తోనే పన్నెండో తరగతీ పూర్తి చేసింది. 82 శాతం మార్కులు తెచ్చుకొని.
- సినిమా, వెబ్ సిరీస్ బిజీ షెడ్యూల్‌నే నిర్ణయించినా చదువును నిర్లక్ష్యం చేయట్లేదు. జంతువులంటే ప్రాణం పెట్టే ఈ ఆమ్మాయికి వెటర్నరీ డాక్టర్ కావాలనేదే భవిష్యత్ లక్ష్యం.
- కథక్ నేర్చుకుంది. సంగీతంలోనూ ప్రవేశం, పెయింటింగ్‌లో నైపుణ్యం ఉన్నాయి. ప్రయాణాలు, పుస్తక పఠనం ఆమె అభిరుచులు.
- ‘హండ్రెడ్’ అనే వెబ్ సిరీస్‌లో లారా దత్తాతో పోటీపడి నటించిందనే ప్రశంసలు పొందింది. చదువు, నటన రెండిటిలోనూ హండ్రెడ్ పర్సెంట్‌కి పోటీ పడగలదని నిరూపించుకుంది.
- ‘సినిమా నటినవుతానని కలలో కూడా ఊహించలేదు. ‘సైరాట్’ డైరెక్టర్ నాగరాజ్‌ది, మాది ఒకే ఊరు.
- మా కుటుంబానికి తెలిసిన వ్యక్తి. ఆడిషన్స్ కోసం మా ఊరొచ్చాడు. నన్ను చూసి.. మా అమ్మ, నాన్నతో మాట్లాడి లీడ్ రోల్‌కి ఓకే చేశాడు. అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్న’ అంటూ తెరంగేట్ర నేపథ్యాన్ని గుర్తు చేసుకుంది రింకు రాజ్ గురు.
Comments
Please login to add a commentAdd a comment