కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
స్థానిక నేతల సీరియస్
సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.
చిత్రబృందంతో వాగ్వాదం..
అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్‌పూర్‌లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment