
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (ఫెఫ్సీ)కు మధ్య సమస్యకు నటుడు శింబునే కారణమని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అన్నారు. శింబు ‘అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్’ మూవీ నిర్మాత మైఖెల్ రాయప్పన్‌కు ఆ చిత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. శింబు తీరుతోనే తాను నష్టపోయానని.. తనకు పరిహారం చెల్లించాలని రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. దీంతో రాయప్పన్‌కు శింబు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. లేనిపక్షంలో ఆయన నటిస్తున్న చిత్రాలకు ఎలాంటి సహకారం అందించబోమని ప్రకటించారు. అయినా శింబు చిత్రాలకు ఫెఫ్సీ కార్మికులు పని చేశారు.
ఈ వ్యవహారంతో ఫెఫ్సీ, నిర్మాతల మండలి మధ్య సమస్యలు తలెత్తాయి. దీనిపై ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె సెల్వమణి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మాతల మండలి విజ్ఞప్తి మేరకు శింబు నటిస్తున్న 4 చిత్రాలకు తాము కూడా ఎలాంటి సహకారం అందించలేదన్నారు. అయితే శింబు హీరోగా ఐసరిగణేష్ నిర్మిస్తున్న చిత్రం ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 4 రోజులు అనుమతి ఇవ్వాలని కోరాలన్నారు. నిర్మాతల మండలి అనుమతితోనే ఫెఫ్సీ కార్మికులు ఈ సినిమాకు పని చేశారని వివరించారు. సీఎం స్టాలిన్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఆయన పేర్కొన్నారు.