కన్నడ ప్రముఖ నటుడు, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు చెందిన షాపింగ్ మాల్‌కు తాళం పడింది. ఈరోజు (ఫిబ్రవరి 14) ఆయనకు సంబంధించిన మాల్‌ను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) అధికారులు సీజ్ చేశారు. బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ ప్రీతీ గెహ్లాట్, జోనల్ జాయింట్ కమిషనర్ బాలశేఖర్ సమక్షంలో అధికారులు దాడులు నిర్వహించారు. 2011 నుంచి 2022- 23 వరకు మాల్ మేనేజ్‌మెంట్ వారు బోర్డుకు చెల్లించాల్సిన పన్ను రూ. 11.51 కోట్లు ఉంది. ఇంత మొత్తంలో కార్పొరేషన్‌కు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని డిమాండ్ నోటీసు జారీ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
రాక్‌లైన్ వెంకటేష్ కన్నడతో పాటు అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఆపై సినిమా పంపిణీ వ్యవహారంలో కూడా ఉన్నారు. బజరంగీ భాయిజాన్, లింగా (రజనీకాంత్), కాటేరా, పవర్ (రవితేజ), ఆటగధరా శివ వంటి చిత్రాలతో పాటు పలు కన్నడ, తమిళ్ సినిమాలను రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకటేష్ నిర్మించిన విషయం తెలిసిందే.
దాసరహళ్లి జాయింట్ కమిషనర్ బాలశేఖర్ ఏం చెప్పారంటే.. 'మాల్ యాజమాన్యం పన్నులో సగం అయినా చెల్లించాలి.. అప్పటి వరకు మాల్ తెరవలేం.. ఇంతకు ముందు ఈ కేసు కోర్టులో ఉంది.. ఏడాది క్రితం కేసు పరిష్కారమైంది. అయినా పన్ను చెల్లించలేదు. ఈ కారణంగానే ఈరోజు మాల్‌కు తాళం వేశాం.. దానికి తాళం వేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయినప్పటికీ మా కర్తవ్యాన్ని నిర్వర్తించాం.' అని అన్నారు.
రాక్‌లైన్ మాల్ మేనేజర్ ప్రకాశ్ వ్యాఖ్యలు 'మాకు నోటీసులు ఇవ్వలేదు.. నిన్న రాత్రి నోటీసు ఇవ్వడానికి వచ్చారు.. రాక్‌లైన్ సార్ వచ్చే వరకు ఆగాలని చెప్పాం.. అయినా వెయిట్ చేయలేదు.. ఈరోజు ఉదయం వచ్చి సడన్‌గా మాల్‌కు తాళం వేశారు. కోర్టు ద్వారా డబ్బులు జమ చేయాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.' అని తెలిపాడు.
గత 10 సంవత్సరాల నుంచి రాక్‌లైన్ వెంకటేష్ పన్ను చెల్లించడం లేదని బీజేపీ బెంగళూరు సౌత్ జిల్లా విభాగం అధ్యక్షుడు ఎన్. ఆర్ రమేష్ ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఆయన సమర్పించారు.
బీబీఎంపీ అధికారులు రాక్‌లైన్ మాల్ ప్రాపర్టీని కొలిచినప్పుడు అది 1,22,743 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తేలింది. అంటే సుమారు 73000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదని, పన్ను ఎగ్గొట్టారని రమేష్‌పై ఫిర్యాదు చేశారు. అప్పట్లో కార్పొరేషన్ జారీ చేసిన నోటీసును ప్రశ్నిస్తూ రాక్‌లైన్ వెంకటేష్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను ఇప్పుడు కొట్టివేసింది. దీంతో పన్ను బకాయిల కారణంగా మాల్‌కు తాళం పడింది.
- పోడూరి నాగ ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment