Rockline Venkatesh
-
ప్రముఖ నిర్మాతకు చెందిన షాపింగ్ మాల్ సీజ్
కన్నడ ప్రముఖ నటుడు, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు చెందిన షాపింగ్ మాల్‌కు తాళం పడింది. ఈరోజు (ఫిబ్రవరి 14) ఆయనకు సంబంధించిన మాల్‌ను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) అధికారులు సీజ్ చేశారు. బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ ప్రీతీ గెహ్లాట్, జోనల్ జాయింట్ కమిషనర్ బాలశేఖర్ సమక్షంలో అధికారులు దాడులు నిర్వహించారు. 2011 నుంచి 2022- 23 వరకు మాల్ మేనేజ్మెంట్ వారు బోర్డుకు చెల్లించాల్సిన పన్ను రూ. 11.51 కోట్లు ఉంది. ఇంత మొత్తంలో కార్పొరేషన్‌కు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని డిమాండ్ నోటీసు జారీ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ కన్నడతో పాటు అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఆపై సినిమా పంపిణీ వ్యవహారంలో కూడా ఉన్నారు. బజరంగీ భాయిజాన్, లింగా (రజనీకాంత్), కాటేరా, పవర్ (రవితేజ), ఆటగధరా శివ వంటి చిత్రాలతో పాటు పలు కన్నడ, తమిళ్ సినిమాలను రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకటేష్ నిర్మించిన విషయం తెలిసిందే. దాసరహళ్లి జాయింట్ కమిషనర్ బాలశేఖర్ ఏం చెప్పారంటే.. 'మాల్ యాజమాన్యం పన్నులో సగం అయినా చెల్లించాలి.. అప్పటి వరకు మాల్ తెరవలేం.. ఇంతకు ముందు ఈ కేసు కోర్టులో ఉంది.. ఏడాది క్రితం కేసు పరిష్కారమైంది. అయినా పన్ను చెల్లించలేదు. ఈ కారణంగానే ఈరోజు మాల్‌కు తాళం వేశాం.. దానికి తాళం వేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయినప్పటికీ మా కర్తవ్యాన్ని నిర్వర్తించాం.' అని అన్నారు. రాక్‌లైన్ మాల్ మేనేజర్ ప్రకాశ్ వ్యాఖ్యలు 'మాకు నోటీసులు ఇవ్వలేదు.. నిన్న రాత్రి నోటీసు ఇవ్వడానికి వచ్చారు.. రాక్‌లైన్ సార్ వచ్చే వరకు ఆగాలని చెప్పాం.. అయినా వెయిట్ చేయలేదు.. ఈరోజు ఉదయం వచ్చి సడన్‌గా మాల్‌కు తాళం వేశారు. కోర్టు ద్వారా డబ్బులు జమ చేయాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.' అని తెలిపాడు. గత 10 సంవత్సరాల నుంచి రాక్‌లైన్ వెంకటేష్ పన్ను చెల్లించడం లేదని బీజేపీ బెంగళూరు సౌత్ జిల్లా విభాగం అధ్యక్షుడు ఎన్. ఆర్ రమేష్ ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఆయన సమర్పించారు. బీబీఎంపీ అధికారులు రాక్‌లైన్ మాల్ ప్రాపర్టీని కొలిచినప్పుడు అది 1,22,743 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తేలింది. అంటే సుమారు 73000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదని, పన్ను ఎగ్గొట్టారని రమేష్‌పై ఫిర్యాదు చేశారు. అప్పట్లో కార్పొరేషన్ జారీ చేసిన నోటీసును ప్రశ్నిస్తూ రాక్‌లైన్ వెంకటేష్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను ఇప్పుడు కొట్టివేసింది. దీంతో పన్ను బకాయిల కారణంగా మాల్‌కు తాళం పడింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు కరోనా?
ప్రముఖ నిర్మాత, నటుడు ‘రాక్‌లైన్’ వెంకటేశ్ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ఆయన కుమారుడు అభిలాష్ డాక్టర్ కావడంతో అతని హాస్పటల్లోనే చికిత్స జరుగుతోందని సమాచారం. సుమలత, అంబరీష్‌ల ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు వెంకటేశ్. గతవారం అంబరీష్ మెమోరియల్‌ను నిర్మించటం కోసం సుమలతతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పని కలిశారు వెంకటేశ్. ఆ తర్వాత సుమలత తనకు కరోనా పాజిటివ్ అని ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రాక్‌లైన్ వెంకటేశ్‌కి కూడా కరోనా సోకి ఉంటుందనే వార్త వినిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించినవాటిలో రజనీకాంత్ ‘లింగా’, సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రాలు ఉన్నాయి. -
కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు-నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన శ్యాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వృత్తిరీత్యా డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన రాక్‌లైన్ దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు. (చదవండి: సీనియర్ నటికి కరోనా పాజిటివ్!) సమలతకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్యకాలంలో సుమలతను కలిసినందున ఆయనకు కూడా కరోనా వచ్చి ఉండొచ్చని అందరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ వెంకటేష్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం రాక్‌లైన్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ రాజవీర మడకారి నాయక అనే పిరియాడికల్ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను ఆయన కన్నడలో రీమేక్ చేశారు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ ‘లింగా’ సినిమాను ఆయనే నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో ఆయన మైసూర్ ఎస్పీగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాతో హీరో తండ్రి మృతి) -
కన్నడ హీరోలకు ఐటీ షాక్
సాక్షి, బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. నలుగురు పెద్ద హీరోలు, ముగ్గురు బడా నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని సక్సెస్ సాధించి బడా నిర్మాతలకు, హీరోలకు కోట్ల రాబడి తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలు పెరగడంతో ఐటీ శాఖ సోదాలు ప్రారం భించింది. కర్ణాటకలోని సుమారు 23 ప్రాంతా ల్లో 200 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రముఖ శాండల్‌వుడ్ హీరోలు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, ప్రముఖ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఐటీ అధికారులు నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏకకాలంలో వేర్వేరుగా సోదాలు ఉదయం 7 గంటల నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ ఇల్లు, మాన్యత టెక్‌పార్కు దగ్గర్లో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ఇల్లు, కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇల్లు, తెలుగులో ‘ఈగ’సినిమా విలన్ కిచ్చ సుదీప్ ఇంట్లో సోదాలు చేశారు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు విజయ్ కిరంగదూరు, రాక్‌లైన్ వెంకటేశ్, నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనోహర్ నివాసాల్లో కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ప్రముఖులు నటించిన, నిర్మించిన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్స్ వివరాలను అధికారులు సేకరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య, నటి రాధిక ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారని వార్తలు వినిపించాయి. ఐటీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తమిళనాట ప్రముఖ హోటళ్లపైనా... సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్న హోటల్ శరవణ భవన్, అంజప్పర్ హోటల్స్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్ తదితర వ్యాపార సంస్థలకు చెందిన 32 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లపై కేంద్రం జీఎస్టీని తగ్గించినా వినియోగదారుల నుంచి పాత జీఎస్టీనే వసూలు చేస్తున్నారని, కొత్త ఏడాది సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాల అమ్మకాలు జరిగినా తక్కువ అయినట్లుగా లెక్కలు రాసినట్లు ఐటీశాఖకు సమాచారం అందింది. దీంతో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టింది. -
లింగా నష్ట పరిహారం చెల్లిస్తాం
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్రప్రదర్శనలో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని చెల్లించేందుకు ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అంగీకరించారు. భారీ అంచనాలతో నిర్మితమైన లింగా చిత్రానికి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అయితే అనుకోని విధంగా చిత్రం ఘోర పరాజయం పాలైంది. చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకొని తమకు జరిగిన నష్టాన్ని భర్తీ అయ్యేలా చూడాలని డిస్ట్రిబ్యూటర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తొలుత అంగీకరించలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన తీవ్రతరం కావడంతో రజనీ జోక్యం చేసుకోక తప్పలేదు. నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతలను రజనీ కోరగా అందుకు వారు అంగీకరించారు. లింగా డిస్ట్రిబ్యూటర్లు తమకు జరిగిన నష్టం లెక్కల వివరాలను నిర్మాతకు అందజేశారు. మరో మూడు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది. తన చిత్రాల వల్ల ఎవరూ నష్టపోరాదని భావించిన రజనీకాంత్ గతంలో బాబా చిత్రానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా తానే చెల్లించారు. అయితే లింగా చిత్రానికి నష్టంలో కొంతభాగం చెల్లిస్తారని తెలుస్తోంది. నిర్మాత నుంచి సొమ్ము ముట్టిన తరువాత మీడియా సమావేశం పెట్టి రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. -
కంటతడి పెట్టిన లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్
చెన్నై: లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చయవద్దని ఆయన కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు మంచి మిత్రులన్నారు. అందుకే తాను కన్నడ వ్యక్తినైన తనతో సినిమా చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, .లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయామని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రజనీకాంత్ జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు లింగ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. లింగా చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని తెలిపారు. లింగ చిత్రం తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో రజనీ ముత్తు, నరసింహ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. లింగ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. -
సినిమా రివ్యూ: పవర్
బలుపు చిత్ర విజయం తర్వాత ’మాస్ మహారాజ’ రవితేజ తదుపరి చిత్రం పవర్. గతంలో డాన్ శ్రీను, మిస్టర్ ఫర్ఫెక్ట్, బలుపు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కే ఎస్ రవీంద్ర) పవర్ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తారు. హన్సిక, రెజీనాలతో కలిసి రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’ బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్‌ను, తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్టైన్మెంట్ను అందించడంలో రవితేజ తన మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్‌కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిరుపమ పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్‌తో ఆలరించారు. కథకు తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు. ఆణిముత్యం పాత్రలో బ్రహ్మనందం మరోసారి తనదైన శైలిలో నవ్వులు విరబోయించారు. ఆణిముత్యం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆణిముత్యం పాత్రతో తెలుగు చిత్రాలకు తన అవసరం ఎంత ఉందో అనే అంశాన్ని మరోసారి బ్రహ్మనందం ప్రూవ్ చేసుకున్నారు. ఇటీ వల కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో పాలుపంచుకుంటున్న సప్తగిరి అవకాశం లభించిన ప్రతిసారి మెరుపులు మెరిపించారు. నిడివి తక్కవైనా సప్తగిరి తన హాస్యంతో ప్రభావం చూపడంలో సఫలమయ్యారు. విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్‌రాజ్ పరిమితమయ్యారు. టెక్నికల్ రొటిన్ కథకు మోహన కృష్ణ, కే చక్రవర్తితో కలిసి కోన వెంకట్ అందించిన మాటలు అక్కడక్కడా బుల్లెట్లా పేలాయి. రవితేజ ఎనర్జీకి, కథకు తగినట్టుగా మాటలతో కోన ఆకట్టుకున్నారు. జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫి బాగుంది. రవితేజను మరింత గ్లామర్‌గా చూపించారు. చిత్ర ఆరంభంలో వచ్చే యాక్షన్, చేజింగ్ ఎపిసోడ్స్ టాలీవుడ్ రే ంజ్కు మించి ఉన్నాయి. మ్యూజిక్ తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ పాడిన నౌటంకి పాట వినడానికే కాకుండా తెరపై చూడటానికి కూడా బాగుంది. ఇతర పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే తమన్ అందించిన సంగీతంలో కొత్తదనమేమి కనిపించలేదు. రెగ్యులర్ బాణీలే మళ్లీ మళ్లీ వింటున్నామా అనే సందేహం కలుగుతుంది. దర్శకత్వం: రచయితగా గుర్తింపు పొంది.. దర్శకుడిగా మారిన బాబీ.. తన తొలి చిత్రంలో సాహసానికి ఒడిగట్టకుండా రెగ్యులర్ సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని పవర్ తెరకెక్కించారు. రవితేజ ఇమేజ్, ఎనర్జీని చక్కగా వాడుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యారు. అయితే పాత చింతకాయనే కథనే మళ్లీ సరికొత్త ప్యాకేజీలో కొత్త రుచిని అందించారని చెప్పవచ్చు. విక్రమార్కుడులో ఉండే ఆత్మను, బలుపులో ఉండే ఎంటర్ టైన్మెంట్ను మిక్స్ చేసి పవర్‌గా కొత్త ప్రొడక్ట్‌ను రూపొందించారు. అయితే ప్రస్తుత కాలంలో సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రొటిన్ కథను చక్కటి స్క్రీన్‌ప్లే, వినోదం అనే పట్టాలకెక్కించి తన ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుడిని తప్పదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా... బలదేవ్ పాత్రను ఆరంభంలోనే ముగించడం, హస్పిటల్లో ఎపిసోడ్లో హోంమంత్రి తల్లికి సంబంధించిన సీన్, ఇంటర్వెల్ ట్విస్, చివర్లో బ్రహ్మీ పాట కొత్తగా అనిపించడమే కాకుండా దర్శకుడి ప్రతిభకు అద్దపట్టాయి. అయితే క్లైమాక్స్‌ను చూస్తే బలుపు తరహా ఇంకా మూస ధోరణినే నమ్ముకున్నారనిపిస్తుంది. ఓవరాల్‌గా అనేక ప్రతికూల అంశాలున్నా... ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సానుకూల అంశాలు డామినేట్ చేశాయని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్లతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడం, త్వరలో వచ్చే భారీ చిత్రాల పోటిని ఎదురిస్తే తప్ప భారీ విజయం చిక్కకపోవచ్చు. --రాజబాబు అనుముల (ఇంగ్లీష్ రివ్యూ) -
అందుకే రవితేజ మాస్ మహరాజా : రాక్‌లైన్ వెంకటేశ్
‘‘తమన్, నేనూ కలిసి పనిచేసిన సినిమాల్లో హిట్లు, సూపర్హిట్లు, యావరేజ్‌లు, ఫ్లాపులు ఉన్నాయి. అయితే... తమన్ సంగీతం మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమాకూ అద్భుతమైన బాణీలు అందిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా నాతో పాడించి మరోసారి ప్రయోగం చేశాడు. ఈ చిత్రం మా కెరీర్లో మరో సూపర్‌హిట్’’ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా రచయిత కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తూ, రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘పవర్’. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించి, కన్నడ నిర్మాత మునిరత్నంకి అందించారు. రవితేజ ఇంకా మాట్లాడుతూ- ‘‘జయనన్ విన్సెంట్, గౌతంరాజు, మనోజ్ పరమహంస, తమన్, రామ్‌లక్ష్మణ్... ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా రావడానికి కారణం వీరే. భారీతనానికి పర్యాయపదం రాక్‌లైన్ వెంకటేశ్. ఆయన పేరులోనే ఏదో తెలీని ‘పవర్’ ఉంది. తెలుగుతెరకు బాబీ రూపంలో మరో మంచి దర్శకుడు దొరికాడు. ఈ సినిమాతో తను కచ్చితంగా స్టార్ డెరైక్టర్‌గా మారతాడు’’ అన్నారు. ‘‘తెలుగులో ఓ చిత్రాన్ని నిర్మించాలని నాలుగైదేళ్లుగా ఉండేది. అప్పట్నుంచీ రవితేజను అడుగుతూనే ఉన్నాను. ఇన్నాళ్లకు ఆయన నుంచి పిలుపు వచ్చింది. బాబీ కథ చెప్పిన తీరుకే ఫిదా అయిపోయాను. అద్భుతంగా ఈ కథను మలిచిన బాబీ టీమ్‌కి నా ధన్యవాదాలు. అందరి అభిమానులూ రవితేజ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందుకే... ఆయన్ను అందరూ మాస్ మహరాజా అంటారు. కొండంత ఎనర్జీ రవితేజ సొంతం’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. బాబీ మాట్లాడుతూ - ‘‘‘బలుపు’ చిత్రం చేస్తున్నప్పుడు రవితేజకు ఈ కథ చెప్పాను. ఇంటర్వెల్ వరకూ విని, చేద్దాం అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు సెల్యూట్. రవితేజలాంటి హీరోలు పరిశ్రమకు అవసరం. దర్శకులు కావాలనే కలతో వచ్చే సహాయ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. అందుకు గట్స్ కావాలి. అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. ఈ వేడుకలో ‘దిల్’ రాజు, కోన వెంకట్, అజయ్, సునిల్ తదితరులతో పాటు పలువురు కన్నడ చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
కోల్‌కతాలో పవర్‌ఫుల్‌గా...
రవితేజ స్టైల్, ఆయన నటన.. మాటతీరు... వీటిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎనర్జీ లెవెల్స్ క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘పవర్’. ఈ సినిమా ద్వారా ‘బలుపు’ చిత్ర కథారచయిత కేఎస్ రవీంద్ర (బాబి)ని దర్శకునిగా పరిచయం చేస్తూ రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 24 వరకూ హైదరాబాద్‌లో ఈ సినిమా రెండో షెడ్యూల్ జరిగింది. ఇప్పటివరకూ ఇంట్రవెల్ ఎపిసోడ్ మినహా... ప్రథమార్ధం టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణను కూడా దర్శకుడు బాబీ పూర్తి చేశారు. మార్చి తొలివారంలో కోల్‌కతా షెడ్యూల్ మొదలవుతుంది. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మేజర్ టాకీ పార్ట్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలిసింది. అట్నుంచి అటే... యూనిట్ బ్యాంకాక్ వెళుతుంది. రవితేజ కెరీర్లో లాండ్మార్క్లా మిగిలిపోయేలా ఈ చిత్రం ఉండబోతోందని, ఆయన పాత్ర చిత్రణ కూడా విభిన్నంగా ఉంటుందని ఫిలింనగర్ టాక్. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాగిణీకన్నా, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, రావురమేష్, ముఖేష్ రుషి, సుబ్బరాజు, సురేఖవాణి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: కోనవెంకట్, సంగీతం: తమన్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, కూర్పు: గౌతంరాజు. -
‘విక్రమార్కుడు’ రేంజ్లో...
‘‘మూడు, నాలుగేళ్ల నుంచి సినిమా చేద్దామని అడుగుతున్నారు రాక్‌లైన్ వెంకటేష్. ఇన్నాళ్లకు సరైన కథ కుదిరింది. ‘బలుపు’ నుంచి బాబీతో ట్రెవెల్ చేస్తున్నాను. బ్రహ్మాండమైన లైన్ తయారు చేశాడు తను. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌గా నిలవాలి. తెలుగులో నిర్మాత వెంకటేష్‌గారు రాక్ అనిపించాలి’’అని రవితేజ అన్నారు. కె.ఎస్.రవీంద్రనాథ్(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తూ రవితేజ కథానాయకునిగా రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి మునిరత్నం నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, ఆనంద్ నాయుడు క్లాప్ ఇచ్చారు. ‘‘తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. బాబీతో కథ వినిపించి నచ్చితే చేయ్ అన్నారు రవితేజ. బాబీ కథ చెప్పిన తీరు నాకు నచ్చింది. ఏదో సాధించాలనే తపన కథ చెప్పేటప్పుడు బాబీలో చూశాను. దర్శకునిగా బాబీకి, నిర్మాతగా నాకూ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో రవితేజ పాత్ర ‘విక్రమార్కుడు’ రేంజ్లో ఉంటుంది’’ అని రాక్‌లైన్ వెంకటేష్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘‘బలుపు’ సినిమాతో నన్ను రైటర్ని చేశారు రవితేజ. ఇప్పుడు దర్శకుణ్ణి చేశారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా’’అని తెలిపారు. ఇంకా కోన వెంకట్ కూడా మాట్లాడారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, రావురమేష్, ముఖేష్‌రుషి, ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్.