సినిమా రివ్యూ: పవర్
సినిమా రివ్యూ: పవర్
Published Fri, Sep 12 2014 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
బలుపు చిత్ర విజయం తర్వాత ’మాస్ మహారాజ’ రవితేజ తదుపరి చిత్రం పవర్. గతంలో డాన్ శ్రీను, మిస్టర్ ఫర్‌ఫెక్ట్, బలుపు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కే ఎస్ రవీంద్ర) పవర్ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తారు. హన్సిక, రెజీనాలతో కలిసి రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’
బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్‌ను, తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంలో రవితేజ తన మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్‌కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు.
నిరుపమ పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్‌తో ఆలరించారు. కథకు తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు.
ఆణిముత్యం పాత్రలో బ్రహ్మనందం మరోసారి తనదైన శైలిలో నవ్వులు విరబోయించారు. ఆణిముత్యం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆణిముత్యం పాత్రతో తెలుగు చిత్రాలకు తన అవసరం ఎంత ఉందో అనే అంశాన్ని మరోసారి బ్రహ్మనందం ప్రూవ్ చేసుకున్నారు.
ఇటీ వల కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో పాలుపంచుకుంటున్న సప్తగిరి అవకాశం లభించిన ప్రతిసారి మెరుపులు మెరిపించారు. నిడివి తక్కవైనా సప్తగిరి తన హాస్యంతో ప్రభావం చూపడంలో సఫలమయ్యారు.
విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్‌రాజ్ పరిమితమయ్యారు.
టెక్నికల్
రొటిన్ కథకు మోహన కృష్ణ, కే చక్రవర్తితో కలిసి కోన వెంకట్ అందించిన మాటలు అక్కడక్కడా బుల్లెట్‌లా పేలాయి. రవితేజ ఎనర్జీకి, కథకు తగినట్టుగా మాటలతో కోన ఆకట్టుకున్నారు. జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫి బాగుంది. రవితేజను మరింత గ్లామర్‌గా చూపించారు. చిత్ర ఆరంభంలో వచ్చే యాక్షన్, చేజింగ్ ఎపిసోడ్స్ టాలీవుడ్ రే ంజ్‌కు మించి ఉన్నాయి.
మ్యూజిక్
తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ పాడిన నౌటంకి పాట వినడానికే కాకుండా తెరపై చూడటానికి కూడా బాగుంది. ఇతర పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే తమన్ అందించిన సంగీతంలో కొత్తదనమేమి కనిపించలేదు. రెగ్యులర్ బాణీలే మళ్లీ మళ్లీ వింటున్నామా అనే సందేహం కలుగుతుంది.
దర్శకత్వం:
రచయితగా గుర్తింపు పొంది.. దర్శకుడిగా మారిన బాబీ.. తన తొలి చిత్రంలో సాహసానికి ఒడిగట్టకుండా రెగ్యులర్ సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని పవర్ తెరకెక్కించారు. రవితేజ ఇమేజ్, ఎనర్జీని చక్కగా వాడుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యారు. అయితే పాత చింతకాయనే కథనే మళ్లీ సరికొత్త ప్యాకేజీలో కొత్త రుచిని అందించారని చెప్పవచ్చు. విక్రమార్కుడులో ఉండే ఆత్మను, బలుపులో ఉండే ఎంటర్ టైన్‌మెంట్‌ను మిక్స్ చేసి పవర్‌గా కొత్త ప్రొడక్ట్‌ను రూపొందించారు. అయితే ప్రస్తుత కాలంలో సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రొటిన్ కథను చక్కటి స్క్రీన్‌ప్లే, వినోదం అనే పట్టాలకెక్కించి తన ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుడిని తప్పదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా... బలదేవ్ పాత్రను ఆరంభంలోనే ముగించడం, హస్పిటల్‌లో ఎపిసోడ్‌లో హోంమంత్రి తల్లికి సంబంధించిన సీన్, ఇంటర్వెల్ ట్విస్, చివర్లో బ్రహ్మీ పాట కొత్తగా అనిపించడమే కాకుండా దర్శకుడి ప్రతిభకు అద్దపట్టాయి. అయితే క్లైమాక్స్‌ను చూస్తే బలుపు తరహా ఇంకా మూస ధోరణినే నమ్ముకున్నారనిపిస్తుంది. ఓవరాల్‌గా అనేక ప్రతికూల అంశాలున్నా... ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సానుకూల అంశాలు డామినేట్ చేశాయని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్లతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడం, త్వరలో వచ్చే భారీ చిత్రాల పోటిని ఎదురిస్తే తప్ప భారీ విజయం చిక్కకపోవచ్చు.
--రాజబాబు అనుముల
Advertisement
Advertisement