మాస్ అంటే... బస్సు పాసు కాదు!
‘‘మాస్ అంటే బస్సు పాసు కాదుబే... ఎవడు పడితే వాడు వాడేసుకోనికి. అది మన బలుపుని బట్టి, బాడీ లాంగ్వేజిని బట్టి, జనం పిలుచుకునే పిలుపు’’... ‘పవర్’ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఈ చిత్రంలో రవితేజ పాత్రచిత్రణ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునంటున్నారు దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ). ఇలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయని ఆయన చెబుతున్నారు. ‘బలుపు’ చిత్రానికి రచయితగా పని చేసిన బాబీలోని ప్రతిభను గుర్తించి రవితేజ ‘పవర్’ డెరైక్షన్ చాన్స్ ఇచ్చారు.
ఇందులో రవితేజ సరసన హన్సిక, రెజీనా నటించారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు తమన్ కెరీర్‌లోనే ఇదొక మంచి ఆల్బమ్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.జి. కృష్ణ.