నేనేం అజ్ఞాతవాసంలో లేను కదా: రవితేజ | Ravi Teja exclusive interview | Sakshi
Sakshi News home page

నేనేం అజ్ఞాతవాసంలో లేను కదా: రవితేజ

Published Sun, Sep 21 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

నేనేం అజ్ఞాతవాసంలో లేను కదా: రవితేజ

నేనేం అజ్ఞాతవాసంలో లేను కదా: రవితేజ

 రవితేజ అంటే ఓ పవర్‌ప్యాక్.. ఆయన తెరపై కనిపిస్తేనే ఓ కిక్. అందుకే ‘మాస్ మహరాజా’ అనిపించుకున్నారు. రవితేజ నటించిన ‘పవర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయమని రవితేజ సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు..
 
 ఏంటండీ.. ఉన్నట్టుండి చాలా సన్నబడిపోయారు? ‘పవర్’ కోసమేనా?
 ఈ మధ్య కొంచెం తగ్గాలనుకున్నాను. తగ్గాను. ప్రత్యేకంగా ‘పవర్’ సినిమా కోసం అని చెప్పలేను కానీ, స్టయిలిష్ పోలీసాఫీసర్ కేరక్టర్ అని దర్శకుడు బాబీ చెప్పగానే, శరీరంలో కొద్దిగా మార్పు చేసుకుంటే, బాగుంటుందనుకున్నా. వాస్తవానికి ఎప్పట్నుంచో తగ్గాలనుకుంటున్నా.
 
 ‘విక్రమార్కుడు’లో పోలీస్‌గా చేశారు. మళ్లీ ‘పవర్’లో అదే పాత్ర కాబట్టి, రెండు సినిమాలకూ పోలికలున్నాయన్నది కొందరి భావన?
 రెండింటికీ సంబంధం లేదు. ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ వేరు. ‘పవర్’లో ఉన్న ఎమోషన్ వేరు. పాత్ర పోలీసే అయ్యుండొచ్చు కానీ, పోలీసులందరూ ఒకే సమస్యను డీల్ చేస్తూ కూర్చోరు కదా. నా కెరీర్‌లో ఇది చాలా చాలా పెద్ద విజయం. నాకు సంపూర్ణమైన ఆనందాన్నిచ్చింది.
 
 కానీ, మొదట్లో ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కదా?
 కొన్ని సినిమాలకు అలా జరగడం సహజం. అంతెందుకు నా సూపర్ హిట్లలో ఒకటైన ‘విక్రమార్కుడు’కి కూడా ముందు ఫ్లాప్ టాకే వచ్చింది. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ అయితే డిజాస్టర్ అనేశారు. కానీ, ఈ చిత్రాలు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నాయో చెప్పక్కర్లేదు.
 
 సక్సెస్ ఖాయం అని మీరు నమ్మిన సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది?
 నా నమ్మకం నాది. మొదటిరోజు టాక్ ఎలా ఉన్నా, ఆ తర్వాత పుంజుకుంటుందనే నమ్మకంతో ఉంటాను. అదే నిజం అవుతుంది. కెరీర్ ఆరంభించిన కొత్తలో ఇలాంటి టాక్‌కి కొంచెం కంగారుపడేవాణ్ణి. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత.. ఎందుకు కంగారు ఉంటుంది. నా సినిమాలో యునానిమస్‌గా హిట్ టాక్ వచ్చిన చిత్రాలు చాలా చాలా తక్కువ. కానీ, ఆ టాక్‌తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయినవి ఎక్కువ.
 
 ఏ నమ్మకంతో బాబీకి దర్శకునిగా అవకాశం ఇచ్చారు?
 క్లారిటీ, కన్విక్షన్, కాన్ఫిడెన్స్.. ఈ మూడూ తనకున్నాయి. మంచి కమర్షియల్ డెరైక్టర్ అవుతాడనే నమ్మకం కుదిరింది నాకు. భవిష్యత్తులో టాప్ 5 అగ్రదర్శకుల్లో తనూ ఉంటాడు. నో డౌట్.
 
 ఇటీవల కాలంలో అటు స్టార్ డెరైక్టర్స్, ఇటు కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?
 కారణం ఏమీ లేదు. ఎవరు మంచి కథ చెబితే వాళ్లకి సినిమా చేస్తున్నాను. నా గత చిత్రం ‘బలుపు’కి బాబీ మంచి కథ ఇచ్చాడు. అతను ‘పవర్’ కథ చెప్పగానే చేయాలనిపించింది. పైగా బాబీ ప్రతిభ మీద నాకు అపారమైన నమ్మకం. అందుకే దర్శకునిగా అవకాశం ఇచ్చా. బాబీ కోసమైనా ‘పవర్’ మంచి విజయం సాధించాలనుకున్నా. అది నెరవేరింది.
 
 ‘పవర్’లో మీకేం నచ్చి ఒప్పుకున్నారు?
 బల్‌దేవ్ సహాయ్ కారెక్టర్ బాగా నచ్చింది. తల్లి పాత్రలో ఉన్న ఎమోషన్‌ని ఇష్టపడ్డాను. అందుకే, ఈ చిత్రం చేశాను.
 
 ఈ మధ్య మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మీరలాంటి చిత్రాలు చేయరా?
 ఎందుకు చెయ్యను? కథ కుదిరితే, ఏ హీరో కాంబినేషనైనా రెడీ.
 
 ఒకప్పుడు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశారు కదా.. మరి డెరైక్షన్ ఎప్పుడు?
 ఇప్పుడు డెరైక్షన్ గురించి ఆలోచించడం లేదండి.
 
 మొదట్లో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలు చేసిన మీరు, ఈ మధ్య రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలే చేస్తున్నారేం?
 ప్రేక్షకులకు అవే నచ్చుతున్నాయి. మనకు నచ్చినవి కాకుండా ప్రేక్షకులకు నచ్చినవి ఇస్తేనే నిర్మాతలు లాభాలు చూడగలుగుతారు. అయితే, ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలు తప్పకుండా చేస్తా. కానీ, ఈ మధ్యకాలంలో అంత బలమైన కథలు నాకు దొరకలేదు.
 
 మిమ్మల్ని హీరోని చేసిన కృష్ణవంశీతో మళ్లీ సినిమా ఎప్పుడు?
 నాకైతే చేయాలనే ఉంది. మళ్లీ మా కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందో చూడాలి.
 
 మీరు దాదాపు ఎవరితోనూ టచ్‌లో ఉండరు.. అసలు కొత్తవాళ్లు మిమ్మల్ని కలిసి, కథలు చెప్పాలంటే ఎలా?
 ఎలాగైనా రావచ్చు. అదంత పెద్ద కష్టమేం కాదు. నేనేం అజ్ఞాతవాసంలో లేను కదా.
 
 ఏడాదికి రెండు చిత్రాలు చేసిన మీరు, ప్రస్తుతం ఒక సినిమాకే పరిమితమవుతున్నారెందుకని?
 నాకు వరుసగా సినిమాలు చేయాలనే ఉంటుంది. కథలు కుదరకే ఈ గ్యాప్. కానీ, ఇక నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా.
 
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement