అందుకే రవితేజ మాస్ మహరాజా : రాక్‌లైన్ వెంకటేశ్ | Ravi Teja's 'Power' movie Audio released | Sakshi
Sakshi News home page

అందుకే రవితేజ మాస్ మహరాజా : రాక్‌లైన్ వెంకటేశ్

Published Sun, Aug 10 2014 11:28 PM | Last Updated on Fri, Jul 12 2019 4:42 PM

అందుకే రవితేజ మాస్ మహరాజా :  రాక్‌లైన్ వెంకటేశ్ - Sakshi

అందుకే రవితేజ మాస్ మహరాజా : రాక్‌లైన్ వెంకటేశ్

‘‘తమన్, నేనూ కలిసి పనిచేసిన సినిమాల్లో హిట్లు, సూపర్‌హిట్లు, యావరేజ్‌లు, ఫ్లాపులు ఉన్నాయి. అయితే... తమన్ సంగీతం మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమాకూ అద్భుతమైన బాణీలు అందిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా నాతో పాడించి మరోసారి ప్రయోగం చేశాడు. ఈ చిత్రం మా కెరీర్‌లో మరో సూపర్‌హిట్’’ అని రవితేజ అన్నారు. ఆయన హీరోగా రచయిత కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తూ, రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘పవర్’. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 ఆడియో సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించి, కన్నడ నిర్మాత మునిరత్నంకి అందించారు. రవితేజ ఇంకా మాట్లాడుతూ- ‘‘జయనన్ విన్సెంట్, గౌతంరాజు, మనోజ్ పరమహంస, తమన్, రామ్‌లక్ష్మణ్... ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా రావడానికి కారణం వీరే. భారీతనానికి పర్యాయపదం రాక్‌లైన్ వెంకటేశ్. ఆయన పేరులోనే ఏదో తెలీని ‘పవర్’ ఉంది. తెలుగుతెరకు బాబీ రూపంలో మరో మంచి దర్శకుడు దొరికాడు. ఈ సినిమాతో తను కచ్చితంగా స్టార్ డెరైక్టర్‌గా మారతాడు’’ అన్నారు. ‘‘తెలుగులో ఓ చిత్రాన్ని నిర్మించాలని నాలుగైదేళ్లుగా ఉండేది. అప్పట్నుంచీ రవితేజను అడుగుతూనే ఉన్నాను.

 ఇన్నాళ్లకు ఆయన నుంచి పిలుపు వచ్చింది. బాబీ కథ చెప్పిన తీరుకే ఫిదా అయిపోయాను. అద్భుతంగా ఈ కథను మలిచిన బాబీ టీమ్‌కి నా ధన్యవాదాలు. అందరి అభిమానులూ రవితేజ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందుకే... ఆయన్ను అందరూ మాస్ మహరాజా అంటారు. కొండంత ఎనర్జీ రవితేజ సొంతం’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. బాబీ మాట్లాడుతూ - ‘‘‘బలుపు’ చిత్రం చేస్తున్నప్పుడు రవితేజకు ఈ కథ చెప్పాను.

 ఇంటర్వెల్ వరకూ విని, చేద్దాం అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు సెల్యూట్. రవితేజలాంటి హీరోలు పరిశ్రమకు అవసరం. దర్శకులు కావాలనే కలతో వచ్చే సహాయ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. అందుకు గట్స్ కావాలి. అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. ఈ వేడుకలో ‘దిల్’ రాజు, కోన వెంకట్, అజయ్, సునిల్ తదితరులతో పాటు పలువురు కన్నడ చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement