‘విక్రమార్కుడు’ రేంజ్‌లో...
‘‘మూడు, నాలుగేళ్ల నుంచి సినిమా చేద్దామని అడుగుతున్నారు రాక్‌లైన్ వెంకటేష్. ఇన్నాళ్లకు సరైన కథ కుదిరింది. ‘బలుపు’ నుంచి బాబీతో ట్రెవెల్ చేస్తున్నాను. బ్రహ్మాండమైన లైన్ తయారు చేశాడు తను. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌గా నిలవాలి. తెలుగులో నిర్మాత వెంకటేష్‌గారు రాక్ అనిపించాలి’’అని రవితేజ అన్నారు. కె.ఎస్.రవీంద్రనాథ్(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తూ రవితేజ కథానాయకునిగా రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది.
ముహూర్తపు దృశ్యానికి మునిరత్నం నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, ఆనంద్ నాయుడు క్లాప్ ఇచ్చారు. ‘‘తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. బాబీతో కథ వినిపించి నచ్చితే చేయ్ అన్నారు రవితేజ. బాబీ కథ చెప్పిన తీరు నాకు నచ్చింది. ఏదో సాధించాలనే తపన కథ చెప్పేటప్పుడు బాబీలో చూశాను. దర్శకునిగా బాబీకి, నిర్మాతగా నాకూ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో రవితేజ పాత్ర ‘విక్రమార్కుడు’ రేంజ్‌లో ఉంటుంది’’ అని రాక్‌లైన్ వెంకటేష్ చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘‘బలుపు’ సినిమాతో నన్ను రైటర్‌ని చేశారు రవితేజ. ఇప్పుడు దర్శకుణ్ణి చేశారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా’’అని తెలిపారు. ఇంకా కోన వెంకట్ కూడా మాట్లాడారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, రావురమేష్, ముఖేష్‌రుషి, ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్.