బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్
బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్
Published Sat, Nov 30 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
తన సినిమా ద్వారా పరిచయమైన దర్శకుణ్ణి... స్టార్‌ని చేసే దాకా వదలడు రవితేజ. ‘నీకోసం’ సినిమా ద్వారా శ్రీను వైట్ల పరిచయం అయ్యారు. ‘వెంకీ’ సినిమాతో ఆయన స్టార్ డెరైక్టర్ అయిపోయారు. ‘షాక్’ చిత్రంతో హరీష్‌శంకర్ దర్శకుడయ్యారు. ‘మిరపకాయ్’తో స్టార్ అయిపోయారు. ఇక మలినేని గోపిచంద్ సంగతి సరేసరి. తొలి సినిమా ‘డాన్‌శీను’తో ఆయన్ను దర్శకునిగా పరిచయం చేసిన రవితేజానే, తర్వాత ‘బలుపు’తో ఆయన్ను స్టార్ డెరైక్టర్‌ని చేశారు. సో... రవితేజ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమైతే... వాళ్లను స్టార్‌ని చేసేదాకా రవి వదలరన్నమాట.
డిసెంబర్ 11న రవితేజ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ‘బలుపు’ కథా రచయిత కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రవితేజ కోసం బాబీ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కచ్చితంగా రవితేజ కెరీర్‌లో మైలురాయిలా ఈ సినిమా నిలుస్తుందని సన్నిహిత వర్గాల భోగట్టా. హన్సిక కథానాయిక. ఇందులో మరో కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ధూమ్, రేస్ తదితర బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెన్ అమీన్ ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. హైదరాబాద్, కోల్‌కతాల్లో చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ విల్సన్, ఆర్ట్: బ్రహ్మ కడలి.
Advertisement
Advertisement