సుదీప్, పునీత్ రాజ్‌కుమార్
సాక్షి, బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. నలుగురు పెద్ద హీరోలు, ముగ్గురు బడా నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని సక్సెస్ సాధించి బడా నిర్మాతలకు, హీరోలకు కోట్ల రాబడి తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలు పెరగడంతో ఐటీ శాఖ సోదాలు ప్రారం భించింది. కర్ణాటకలోని సుమారు 23 ప్రాంతా ల్లో 200 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రముఖ శాండల్‌వుడ్ హీరోలు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, ప్రముఖ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఐటీ అధికారులు నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఏకకాలంలో వేర్వేరుగా సోదాలు
ఉదయం 7 గంటల నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ ఇల్లు, మాన్యత టెక్‌పార్కు దగ్గర్లో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ఇల్లు, కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇల్లు, తెలుగులో ‘ఈగ’సినిమా విలన్ కిచ్చ సుదీప్ ఇంట్లో సోదాలు చేశారు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు విజయ్ కిరంగదూరు, రాక్‌లైన్ వెంకటేశ్, నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనోహర్ నివాసాల్లో కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ప్రముఖులు నటించిన, నిర్మించిన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్స్ వివరాలను అధికారులు సేకరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య, నటి రాధిక ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారని వార్తలు వినిపించాయి. ఐటీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
తమిళనాట ప్రముఖ హోటళ్లపైనా...
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్న హోటల్ శరవణ భవన్, అంజప్పర్ హోటల్స్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్ తదితర వ్యాపార సంస్థలకు చెందిన 32 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లపై కేంద్రం జీఎస్టీని తగ్గించినా వినియోగదారుల నుంచి పాత జీఎస్టీనే వసూలు చేస్తున్నారని, కొత్త ఏడాది సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాల అమ్మకాలు జరిగినా తక్కువ అయినట్లుగా లెక్కలు రాసినట్లు ఐటీశాఖకు సమాచారం అందింది. దీంతో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment