సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు | Saga Of Bollywood Actor Sushant Singh Rajput Death Case | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు

Published Wed, Sep 9 2020 8:02 AM | Last Updated on Wed, Sep 9 2020 8:46 PM

Saga Of Bollywood Actor Sushant Singh Rajput Death Case - Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా మంది నోళ్లలో నిత్యం నానుతున్న పేరు. బాలీవుడ్‌లోని నెపోటిజాన్ని వెలుగులోకి తెస్తూ.. బీ ప్రముఖుల అసలు రంగును బయటపెట్టిన పేరు. నటుడిగా అతడికి దక్కిన గుర్తింపుకంటే.. ఓ కేసుగా దక్కిన గుర్తింపే ఎక్కువని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోకుండా.. కొత్తకొత్త మలుపులతో కేసు ముందుకు సాగిపోతూనే ఉంది. రంగుల బాలీవుడ్‌ తెర వెనుక చీకట్లు.. ఒత్తిళ్లతో మత్తుకు దగ్గరై చిత్తవుతున్న నటీనటుల జీవితాలను బహిర్గతం చేస్తోంది. బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురిచేసిన సుశాంత్‌ కేసు పరిణామక్రమాలను ఒకసారి పరిశీలిద్దాం..

జూన్‌ 14 : సుశాంత్‌ ఆత్మహత్య 
2020 జూన్‌ 14 ఆదివారం నాడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై, వెస్ట్‌ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఆత్మహత్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. అయితే అంతకు కొద్దిరోజుల క్రితం సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశ సలియా ఆమె నివాసం ఉంటున్న భవనం 14వ అంతస్తునుంచి ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇద్దరి మరణాలకు ఏదైనా సంబంధం ఉందనే కోణంలో పుకార్లు షికార్లు చేశాయి. 

జూన్‌ 15 : సుశాంత్‌ ప్రియురాలు రియా విచారణ
జూన్‌ 15 సోమవారం నాడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో అతడి ప్రియురాలు నటి రియా చక్రవర్తిని ముంబై పోలీసులు విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం సుశాంత్‌ సుశాంత్‌ మృతదేహాన్ని ముంబైలోని కూపర్‌ ఆసుపత్రికి తరలించగా రియా అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సుశాంత్‌ ఆత్మహత్యకు ఆమెకు సంబంధం ఉందా అనే కోణంలో విచారించారు.

వెలుగులోకి బాలీవుడ్‌ ప్రముఖుల నెపోటిజం
సుశాంత్‌ మరణానికి బాలీవుడ్‌ ప్రముఖుల నెపోటిజమే కారణమంటూ పలువురు ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవటానికి కారణం అతని ఎదుగుదల ఓర్వలేక పలు సినిమాల నుంచి తొలిగించటమేనని, వాళ్లు ఎవరో తనకు తెలుసునని బాలీవుడ్‌ నెపోటిజంపై మొదటిసారి దర్శకుడు శేఖర్‌ కపూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం క్వీన్‌ కంగనా రనౌత్‌, నటుడు గుల్షాన్‌ దేవయ్య, అభినవ్‌ కశ్యప్ తదితరులు బాలీవుడ్‌లోని నెపోటిజంపై విమర్శలు చేశారు.

జూన్‌ 17 : బాలీవుడ్‌ ప్రముఖులపై కేసులు
సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యకు బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్‌ల నెపోటిజమే కారణమంటూ జూన్‌ 17 బుధవారం నాడు బిహార్‌ ముజఫర్‌ కోర్టులో కేసు నమోదైంది. సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. వారితో పాటు మరో 8 మందిపై ఐపీసీ సెక్షన్‌ 306, 109, 504, 506 కింద పిటిషన్‌ దాఖలు చేశారు.

జూన్‌ 20 : 14 మంది వాగ్మూలాల నమోదు
సుశాంత్‌ మృతికి సంబంధించి 14 మంది వాగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. సుశాంత్‌ తండ్రి, అతని ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఓ స్నేహితుడు, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ పితాని, మేనేజర్‌ సందీప్‌ సావంత్‌, నటుడు మహేష్‌ శెట్టీ, కాస్టింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ ఛాబ్రా, బిజినెస్‌ మేనేజర్‌ శ్రుతీ మోదీ, పీఆర్‌ఓ అంకితా తెహ్లానీ, నటుడు రియా చక్రవర్తి, తాళాలు తయారు చేసే ఓ వ్యక్తి, ఇంట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
 
జులై 10 : తెరపైకి సీబీఐ విచారణ డిమాండ్‌ 
సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ)తో విచారణ జరిపించాలని మొదటిసారిగా మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్​ చేశారు. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్​ భండారీతో సుశాంత్ కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని చెప్పినట్లు ట్విట్టర్​ వేదికగా ఆయన పేర్కొన్నారు. అనంతరం పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సీబీఐ విచారణకు పట్టుబట్టారు.

జూలై 28 : రియాపై సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు
జూలై 28 మంగళవారం నాడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ పోలీసులను ఆశ్రయించారు. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజేంద్రనగర్‌ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రియాతోపాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జూలై  29 : సుప్రీం కోర్టుకు రియా
ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది ఈ రోజునే. సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ముంబై పోలీసులకు అప్పగించాలని ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

జులై 31 : కేసులోకి ఎంటరైన ఈడీ
సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మనీ లాండరింగ్‌ ఆరోపణలతో కేసు నమోదు చేశారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు 5 : సీబీఐ విచారణకు కేంద్ర గ్రీన్‌ సిగ్నల్‌ 
ఆగస్టు 5 బుధవారం నాడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం  చేసిన సిఫారసును కేంద్రం అంగీకిరించి ఈ నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 6 : రియాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ 
కేంద్రం తీర్పుతో రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్‌ ప్రియురాలు రియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఇంద్రజిత్‌ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్‌ చక్రవర్తి, శామ్యూల్‌ మిరంద, శ్రుతి మోదీ ఇతరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది.
 
ఆగస్టు 24 : రియా, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు
సుశాంత్‌ మృతి కేసులో దర్యాప్తును మమ్మరం చేసిన సీబీఐ రియా, ఆమె తండ్రికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన‌ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. 

ఆగస్టు 24 : వెలుగులోకి డ్రగ్‌ డీలింగ్‌ ఆరోపణలు
సుశాంత్‌ మృతి చెందిన రోజున అతడ్ని దుబాయ్‌ కంప్లైంట్‌ డ్రగ్‌ డీలర్‌ అయాష్‌ ఖాన్‌ కలిశారని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 

ఆగస్టు 26 : బయటపడ్డ డ్రగ్‌ డీలర్‌తో రియా సంబంధాలు
డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో రియా చక్రవర్తి చేసిన వాట్సాప్‌ చాట్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చాట్‌లో.. ‘నేను ఎక్కువ డ్రగ్స్‌ వాడలేదు’ అనే మెసేజ్‌ను రియా..గౌరవ్‌కు 2017 మార్చి 8న పంపింది. రెండో సారి ‘మీ వద్ద ఎంపీ ఉందా’ అని రియా గౌరవ్‌ను ప్రశ్నించింది.

ఆగస్టు 27 : రియాపై నార్కోటిక్స్‌ కేసు 
నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇచ్చిన సమాచారం మేరకు ఎన్‌డీపీఎస్‌(నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) చట్టంలోని పలు సెక్షన్ల కింద రియాతోపాటు ఇతరులపైనా కేసులు పెట్టినట్లు ఎన్‌సీబీ బుధవారం వెల్లడించింది.

ఆగస్టు 28 : సీబీఐ విచారణకు రియా 
సుశాంత్‌ మృతి కేసుకు సంబంధించి సీబీఐ రియాకు సమన్లు పంపిన నేపథ్యంలో ఆమె ఆగస్టు 28 శుక్రవారం విచారణకు హాజరయ్యారు. 

సెప్టెంబర్‌ 4 : కేసులో కీలక మలుపు 
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక  ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రియానే డ్రగ్స్‌ తీసుకురమ్మందని ఆమె సోదరుడు షోవిక్‌ అధికారులకు తెలిపాడు.

సెప్టెంబర్‌ 6 : ఎన్‌సీబీ విచారణకు రియా
సుశాంత్‌ మృతికి డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉందని తేలటంతో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎన్‌సీబీ నటి రియా చక్రవర్తికి ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబైలోని ఆమె ఇంటికి చేరుకున్న అధికారులు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించారు. తదుపరి విచారణకై ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పడంతో.. ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా అక్కడకు బయల్దేరి వెళ్లారు. అక్కడ ఎన్‌సీబీ ఆమెపై ప్రశ్నలు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రియాను అరెస్ట్‌ చేస్తారనే వార్తలు వెలువడ్డాయి.

సెప్టెంబర్‌ 8 : రియా అరెస్ట్‌ 
సుశాంత్‌ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ అనంతరం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది. రియా వాట్సాప్‌ ఛాట్స్‌ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన ఎన్‌సీబీ తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటికొచ్చాయి. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోన్న బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ చిట్టా బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పేర్లను రియా ఎన్‌సీబీ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement