
"దాని కుడి భుజం మీద కడువా... దాని కుత్తెపు రైకలు మెరియా.." ఈ పాట జనాలకు ఎంతమేరకు అర్థమవుతుందో తెలీదు కానీ.. ఎవరి నోట విన్నా, ఎవరి ఫోన్ రింగయినా ఇప్పుడు ఇదే పాట. అంతలా మార్మోగిపోతోందీ సాంగ్. అచ్చమైన జానపదాన్ని రంగరించి పోసినట్లున్న దీన్ని అక్కున చేర్చుకున్నారు తెలుగు ప్రజలు. అందుకే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ప్రజలు దీన్ని అమితంగా ఆదరించారు. ఈ నేపథ్యంలో సారంగదరియా పాట తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
యూట్యూబ్‌లో విడుదలైన కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఓ తెలుగు పాట ఇంత త్వరగా ఈ రికార్డును సాధించడం చాలా అరుదైన విషయమని చెప్తున్నారు సినీపండితులు. ఇక ఈ సాంగ్ కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి అల వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.
పవన్ సీహెచ్ సంగీతానికి తోడు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం మంగ్లీ మధుర గానంతో 'సారంగదరియా..' అద్భుత హిట్‌గా నిలిచింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఫిదా భామ సాయి పల్లవి ఓ రకంగా నెమలి నాట్యం చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి లవ్ స్టోరీ సినిమాకు ఈ సాంగ్ బాగానే ప్లస్ అవుతోంది. మరి ఏప్రిల్ 16న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment