'సెల్మన్ భాయ్' పై ‘సల్మాన్‌ భాయ్‌’ కేసు | Salman Khan Files Complaint Against Selmon Bhai Court Blocks Video Game | Sakshi
Sakshi News home page

ఆ గేమ్‌ నన్ను వ్యంగ్యంగా చూపిస్తోంది: సల్మాన్‌ ఖాన్‌

Published Wed, Sep 8 2021 11:10 AM | Last Updated on Wed, Sep 8 2021 11:18 AM

Salman Khan Files Complaint Against Selmon Bhai Court Blocks Video Game - Sakshi

కండల వీరుడు, స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ గురించి బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్‌ తెలిసిందే.  అభిమానులు ఆయన్ని ముద్దుగా ‘సల్మాన్‌ భాయ్‌’ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైన విషయం విదితమే. ఈ కాన్సెప్ట్‌ ఆధారంగా తయారైన వీడియో గేమ్‌ ‘సెల్మన్‌ భాయ్‌’. అది తన ముద్దు పేరు ‘సల్మాన్‌ భాయ్‌’ని పోలి ఉందని, అందులోని చిత్రాలు ఆయన్ని వ్యంగంగా చూపిస్తున్నాయని, గేమ్‌ డెవలపర్స్‌పై సల్మాన్‌ ముంబై సివిల్‌ కోర్టులో గత నెల ఫిర్యాదు చేశాడు. 

సల్లు భాయ్‌ కేసును విచారించిన ముంబై సివిల్‌ కోర్టు జడ్జి ‘సెల్మన్‌ భాయ్‌’ వీడియో గేమ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సివిల్ కోర్టు జడ్జి కెఎం జైస్వాల్ సోమవారం (సెప్టెంబర్‌ 6న) జారీ చేయగా, మంగళవారం (సెప్టెంబర్‌ 7) నుంచి దాని కాపీ  అందుబాటులోకి వచ్చింది. 

ఆ గేమ్‌ సల్మాన్‌ ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసుకు పేరడీల ఉందని ప్రాథమిక విచారణ తేలినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. కాబట్టి ఆ వీడియో గేమ్‌ ప్రమోషన్స్‌, లాంచింగ్‌, రీ లాంచింగ్‌ల్లో సల్మాన్‌ ఖాన్‌కి సంబంధించిన ఎటువంటి విషయాలు లేకుండా నిషేధించారు. అలాగే ఆ గేమ్‌ని గూగుల్‌ ప్లే స్టోర్‌ లాంటి అన్ని ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించాలని గేమ్‌ డెవలపర్స్‌ పేరడీ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ గేమ్‌కి సంబంధించి సల్మాన్‌ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు.

‘‘సెల్మన్‌ భాయ్‌’ గేమ్‌ డెవలపర్స్‌ నా అనుమతి లేకుండానే కమర్షియల్‌గా లబ్ధిపొందారని’ గతనెల సల్మాన్‌ ఖాన్‌ ఫైల్‌ చేసిన కేసులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సెప్టెంబర్‌ 20లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని గేమ్‌ డెవలపర్స్‌కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే: ది మోస్‌ వాంటెడ్‌ భాయ్‌’తో ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలరించాడు. కాగా ప్రస్తుతం ఆయన తదుపరి సినిమా లాల్‌ సింగ్‌ చద్ధా షూటింగ్‌ జరుపుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement