రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సముద్రుడు. నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధావత్ కిషన్ నిర్మిస్తున్నారు. హీరో సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు నగేష్ నన్ను చూసి సముద్రుడు అనే టైటిల్ పెట్టాడు. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాట నేడు నిజమైంది అన్నారు.
మొదటి వ్యక్తి నేనే
హీరో సుమన్ మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నటుడినయ్యాను. మొట్టమొదట చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వ్యక్తిని నేనే! అన్నమయ్య, రామదాసు సినిమాల తర్వాత చేసిన పాత్రలే చేయడం ఎందుకని దేవుడు పాత్రలు చేయడం మానేశాను. కానీ నగేష్ చెప్పిన కథ నచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి పాత్రలో నటించాను.
ఛత్రపతిలా పెద్ద హిట్
నేను చేసిన 750 సినిమాల్లో చెప్పుకోదగ్గవాటిలో ఇదీ ఒకటి. అలాంటి మంచి కథను తీసుకొచ్చిన వ్యక్తి దర్శకుడు నగేష్. ఇప్పుడాయన జాలర్ల జీవితాలపై సముద్రుడు తీశాడు. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. ఛత్రపతి ఎంత పెద్ద విజయం సాధించిందో ఈ సముద్రుడు సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
20 శాతం వారికే..
దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. సముద్రం దగ్గర ఉండే జాలర్లు చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని సినిమాలో చూపించాం. ఒక మంచి పాత్రలో అడగ్గానే ఒప్పుకుని నటించిన మా అన్న సుమన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు అన్నారు. ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ నుంచి 20 శాతం మత్స్యకారుల జీవనానికి అందజేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment