టీవీలో బ్రేక్ వస్తే.. ఈ అమ్మాయి తప్పకుండా మీకు దర్శనమిస్తుంది. ఎందుకంటే, ఆ ఐదు నిమిషాల బ్రేక్‌లో పది యాడ్స్ వస్తే.. ఒక దానిలోనైనా సంజనా సంఘీ నటించి ఉంటుంది. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే.. తండ్రి సందీప్ సంఘీ బిజినెస్‌మన్, తల్లి సుగాన్ హోమ్ మేకర్, అన్న సమీర్ గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇదీ సంజన కుటుంబం. పదమూడేళ్ల వయసులో బాలీవుడ్ మూవీ ‘రాక్‌స్టార్’తో బాలనటిగా ఎంటర్ అయినా, నటిగా గుర్తింపు సాధించింది మాత్రం 2019లో ‘దిల్ బేచారా’ సినిమాతో. క్యాన్సర్ రోగిగా తను కనబరచిన నటన చాలా మందిని కంటతడి పెట్టించింది. ఫిట్‌నెస్ పట్ల చాలా శ్రద్ధ సంజనాకు. యోగాతోనే తన రోజు మొదలవుతుంది. కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది.
యాడ్స్, మూవీస్ అంటూ ఎంత బిజీగా ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్‌లో తను సాధించిన మార్కులకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసా పత్రం బహూకరించి, అభినందించారు. ఇక లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో గోల్డ్ మెడల్ పొందింది. అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్ చేయడం. మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం. సినిమా కంటే ముందు వాణిజ్య ప్రకటనలు ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
తన క్యూట్ ఫేస్‌తో కోకా కోలా, క్యాడ్‌బరీ, మింత్రా, ఎయిర్‌సెల్, డాబర్, తనిష్క్ వంటి సుమారు నూటాయాభై ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత ‘హిందీ మీడియం’, ‘ఫుక్‌రే రిటర్న్స్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆదిత్యరాయ్ కపూర్‌తో కలసి ‘ఓమ్’ సినిమాలో నటిస్తోంది. పుస్తకాలతో స్నేహం చేసే ఆమె.. కాలేజీ రోజుల్లోనే ‘యూత్ కీ ఆవాజ్’, ‘ది శాటిలైట్’ వెబ్‌సైట్స్‌కు ఫీచర్ రైటర్‌గా పనిచేసింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొద్దిరోజులు బీబీసీలో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది.
రాక్‌స్టార్ మూవీ షూట్‌లోనే నటిగా మారాలని నిర్ణయించుకున్నా.. అప్పటి వరకు నేను సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు
- సంజనా సంఘీ
Comments
Please login to add a commentAdd a comment