ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్‌ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్‌లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్‌లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్‌ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్‌కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్‌లో దాగివున్న నిజాలను ఈ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment