తమిళసినిమా: సీనియర్ నటి కోవై సరళను ఇప్పటి వరకు వినోదానికి రునామా అనే అందరూ అనుకుంటారు. అత్యధిక చిత్రాల్లో ఆమె అలాంటి పాత్రలే చేశారు కూడా. అలాంటి నటిని దర్శకుడు ప్రభు సాల్మన్ పూర్తిగా వేరే కోణంలో తెరపై ఆవిష్కరించారు. ఆ చిత్రం పేరు సెంబీ. ఇందులో కోవై సరళ ప్రధాన పాత్రను పోషించగా, తంబిరామయ్య, అశ్విన్‌కుమార్, బేబి నిలా, నాంజిల్ సంపత్, పళ కరుప్పయ్య, ఆకాష్ జ్ఞానసంబంధం, ఆండ్రూస్, భారతీ కన్నన్ ముఖ్యపాత్ర పోషించారు. ఆర్ రవీంద్రన్ టాలెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్, ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేతలు అజ్మల్‌ఖాన్, రియా కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ప్రభు సాల్మన్ నిర్వహించారు.
రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ చిత్ర విడుదల హక్కును పొందింది. దర్శకుడు ప్రభు సాల్మన్ ఇంతకుముందు రూపొందించిన మైనా, కుంకీ చిత్రాలు తరహాలోనే ఈ సెంబి చిత్రాన్ని కూడా వైవిధ్య భరితంగా తెరకెక్కించారు. ఒక అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న బామ్మ (నటి కోవై సరళ) ఆ ప్రాంతంలో పక్షుల గుడ్లను, తేనెను అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఒక రాజకీయ నాయకుడి కొడుకు గ్యాంగ్ రేప్ చేస్తాడు. దీంతో ఆ బామ్మ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తుంది.
కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి రాజకీయ నాయకుడికి అమ్ముడుపోవడంతో అది సహించలేని ఆ బామ్మ అతనిపై తిరగబడుతుంది. అక్కడి నుంచి వారికి కష్టాలు మొదలవుతాయి. ఈ సంఘటనపై రాజకీయాలు చొచ్చుకు రావడంతో కథ ఆసక్తిగా సాగుతుంది. అయితే ఆ బామ్మ తన మనవరాలిపై జరిగిన అఫయిత్యానికి ప్రతీకారం తీసుకోగలిగిందా లేదా అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో సాగే చిత్రం సెంబి. 60 ఏళ్లు పైబడిన కోవై సరళ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశారనే చెప్పాలి. బామ్మ పాత్రలో అంత అద్భుతంగా జీవించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ ప్రతి సన్నివేశాన్ని సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment