సీనియర్ నటుడు చంద్రమోహన్ వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన నాలుగైదేళ్లుగా వెండితెరపై కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు.
చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జలంధర మాట్లాడుతూ.. చంద్రమోహన్ చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందంటారు. జనవరి ఒకటో తారీఖుకు ఎంతోమంది వస్తుంటారు. అలా ఆయన చేత్తో నాకు డబ్బివ్వడం వల్ల నాకూ మంచి రచయిత్రిగా పేరొచ్చింది అని ఆమె చెప్పడంతో చంద్రమోహన్ ఎమోషనలై కళ్లు తుడుచుకున్నాడు.
చంద్రమోహన్ తను సంపాదించి పోగొట్టుకున్న ఆస్తి గురించి చెప్తూ.. 'గొల్లపూడి మారుతీరావు కోంపల్లి దగ్గర ద్రాక్షతోట కొన్నారు. నన్నూ కొనమని చెప్పారు. నేనూ 35 ఎకరాల దాకా కొన్నాను. కానీ దాన్ని మేనేజ్ చేయలేక అన్నీ అమ్మేశాను. శోభన్ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మాను, ఈరోజు దాని విలువ రూ.30 కోట్లు. శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్‌కు 6 ఎకరాలు కొన్నాను. అదీ అమ్మేశాను. ఇప్పుడక్కడ మంచి రిసార్టులు పెట్టారు. అలా దాదాపు రూ.100 కోట్లు దాకా పోగొట్టుకున్నాను. సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ. జయసుధది కూడా అదే పరిస్థితి' అని చెప్పుకొచ్చాడు
Comments
Please login to add a commentAdd a comment