నట కిరీటి, నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్. ఆయన సినిమా వస్తుందంటే అటు వినోదాన్ని పంచుతూనే ఇటు సందేశాన్ని కూడా అందిస్తాడు. అయితే స్క్రీన్ మీద కామెడీని పండించే ఆయన నిజ జీవితంలో కాస్త గంభీరంగా ఉంటాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో వెల్లడించాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తవగానే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన రాజేంద్ర ప్రసాద్ గోల్డ్‌మెడల్‌తో బయటకు వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా గాలి సంపత్ సినిమాలో ఫఫ్ఫఫ్ఫా.. భాషతో అభిమానులను అలరించనున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలోని బాధాకరమైన సంఘటనలను తలుచుకుని చింతించాడు.
"నేను నటనారంగంలోకి ప్రవేశించిన సమయంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలనుకున్నాను. దీంతో చార్లీ చాప్లిన్ సినిమాలు చూసి నాకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకున్నాను. అలా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ ఒకానొక సమయంలో దగ్గరివాళ్లే నన్ను ఆర్థికంగా మోసం చేశారు. నేను సంపాదించిందంతా ఊడ్చుకుపోయారు. నమ్మినవాళ్లే ఇంత దారుణంగా ఎలా మోసం చేస్తారని షాకయ్యాను" అని రాజేంద్రప్రసాద్ తెలిపాడు.
కాగా 40 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్ర ప్రసాద్ తాజాగా క్లైమాక్స్, గాలి సంపత్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. మరోవైపు జయప్రదతో కలిసి ‘లవ్ – 60’ అనే సినిమా చేయనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment