
76 ఏళ్ల షర్మిలా టాగోర్‌కు ఈ వయసులో తల్లిగా ఆందోళన పట్టుకొంది. కొడుకు సైఫ్ అలీఖాన్ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని కాదు. చెడ్డ స్క్రిప్ట్‌ల వల్ల చికాకుల్లో పడుతున్నాడని. దానికి కారణం ‘తాండవ్’ వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్‌లో జనవరిలో విడుదలైన 9 ఎపిసోడ్‌ల ఈ వెబ్ సిరీస్ రాజకీయ డ్రామాకు చెందినదే అయినా హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యానాలు మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని వివాదం చెలరేగింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, రచయిత గౌరవ్ సోలంకి, నటుడు జీషాన్ ఇంకా నిర్మాతల మీద కేసులు నమోదయ్యాయి. సైఫ్ ఇందులో నేరుగా లేకపోయినా అతను నటించాడు కనుక ఇదొక తలనొప్పిగా మారింది. పైగా సిరీస్ టీమ్ సుప్రీంకోర్టులో అరెస్టులు చేయకుండా రక్షణ ఇవ్వండి అనంటే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. దాంతో సిరీస్ టీమ్‌కు టెన్షన్ మొదలయ్యింది.
ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ ఏం తలనొప్పులు తెచ్చుకుంటాడోనని షర్మిలా టాగోర్ బెంగ పడుతోంది. ‘వాడు రొటీన్ వేషాలు ఇష్టపడడు. భిన్నమైనవి ఎంచుకుంటాడు. ఒక్కోసారి ఇలా జరుగుతుంటుంది’ అందామె. తల్లి ఆందోళన చూసి కొడుకు కూడా కొంచెం సర్దుకున్నాడు. ‘ఇక మీదట నేను ఓకే చేసే అసైన్‌మెంట్ల కథను మా అమ్మ వినాలి. ఆమె సలహా నేను తీసుకోవాలి’ అని ప్రకటించాడు. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక గజం ఆవలికి వెళ్లి కథను చెబుతున్నాయి. అయితే ఆ సాహసం అన్నిసార్లు సద్ఫలితాలే ఇవ్వవని ఈ ఉదంతం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment