క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్‌కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్‌హౌస్‌ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.
ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.
బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ మోసం బయటపడటంతో సదరు బిట్‌కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment