
ముంబై: ఓటీటీలో పోర్న్ సినిమాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంలో పొడుగు కాళ్ల సుందరి తన భర్తకి అండగా నిలిచింది. తన భర్త చాలా అమాయకుడని, శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని ముంబై పోలీసుల ఎదుట వెల్లడించింది. ఈ రెండింటికి చాలా తేడా ఉందని శిల్ప తన వాంగ్మూలంలో వివరించింది.
శుక్రవారం రాత్రి దాటేదాకా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు బృందం శిల్పను దాదాపుగా ఆరు గంటల సేపు ప్రశ్నించింది. హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చేవన్నీ ఎక్కువగా కుంద్రా బావగారు ప్రదీప్ భక్షి తీస్తారని ఆమె విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్న్ సినిమాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని శిల్ప చెప్పినట్టు తెలిపాయి. హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే కంటెంట్‌పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది.
ఆది నుంచీ వివాదాలే
కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. ఐపీఎల్ బెట్టింగ్, బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో ఆయన ప్రమేయంపై ప్రకంపనలు రేగాయి. పంజాబ్ నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన కుటుంబంలో 1975 నవంబర్ 9న లండన్‌లో కుంద్రా జన్మించారు. నేపాల్‌లో తొలుత శాలువాల వ్యాపారాలు చేశారు. బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో పాల్గొన్న అనంతరం శిల్ప ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్లినప్పుడు 2007లో లండన్‌లో కుంద్రాను కలుసుకున్నారు.
రెండేళ్లపాటు డేటింగ్ చేశాక 2009లో పెళ్లిచేసుకున్నారు. వారిద్దరూ ఐపీఎల్ రంగంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో పెట్టుబడి పెట్టారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న కుంద్రాపై సుప్రీంకోర్టు కమిటీ జీవితకాల నిషేధం విధించింది. 2018లో రాజ్‌ని బిట్ కాయిన్ వ్యాపారంలో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment